e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

రోజుకు రూ.800 కూలి చెల్లించాలి.. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్

నారాయణపేట: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు సంబంధించిన మూడు వారాల వేతన బిల్లులు గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేసి కూలీలకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసిన కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం నారాయణపేట మండల పరిధిలోని శాసన్పల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను బండమీది బలరాం సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం, అధికారులు కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై కూలీల నుంచి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా బండమీది బలరాం మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి ఉపాధి పనులు చేయడం కూలీలకు కష్టంగా మారిందన్నారు. మండుటెండలో గంటల తరబడి శ్రమిస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూలీలకు నీడ, తాగునీరు, ప్రథమ చికిత్స పెట్టె వంటి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పని ప్రదేశాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఉపాధి కూలీలు తమ శ్రమకు తగిన ప్రతిఫలం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన వేతనాలు సకాలంలో అందకపోవడంతో కూలీలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. మూడు వారాల పనికి సంబంధించిన బిల్లులు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉండటం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కూలీల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని పెండింగ్ వేతనాలను ఎలాంటి జాప్యం లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి కూలీలకు నష్టం కలిగించే విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని ఆయన కోరారు. గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసా అందించే ఈ పథకాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకోవద్దని సూచించారు.

ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీలకు రోజుకు కనీసం రూ.800 కూలి చెల్లించాలని బండమీది బలరాం డిమాండ్ చేశారు. కూలీల హక్కులను కాపాడేందుకు కార్మిక సంఘాలు నిరంతరం పోరాటం కొనసాగిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, క్షేత్ర సహాయకుల రాష్ట్ర నాయకులు బికాశీనాథ్, జిల్లా నాయకులు ప్రసాద్ తదితరులతో పాటు పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE