e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోవాలి.. డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న అపవాదును తొలగించాలి: కల్వకుంట్ల కవిత

మన భారత్, హైదరాబాద్:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పట్టభద్రులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు విద్యావంతుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మలుచుకోవాలని కోరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గురువారం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రధాన ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యలపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని కవిత విమర్శించారు. అధికార పార్టీకి, నిష్క్రియంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలకు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని పేర్కొన్నారు. పొలంలో ఫ్యూజ్ ఎగిరిపోతే రైతులు కొత్త ఫ్యూజ్ వేసి తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లుగా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం కల్పించాలని రైతన్నలను కోరారు.

యువతకు, బీసీలకు ప్రాధాన్యత

తమ పార్టీ తరఫున విద్యావంతులైన యువకులను అభ్యర్థులుగా నిలబెట్టామని కవిత తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరిని, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను బరిలోకి దించినట్లు వెల్లడించారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గాలకు చెందినవారేనని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థుల ఎంపిక చేపట్టామని వివరించారు.

ఆకాశ్ కొల్లూరి కుమ్మరి సామాజిక వర్గానికి చెందినవారని, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించాలన్న ఉద్దేశంతో ఆయనకు అవకాశం కల్పించామని చెప్పారు. ఇద్దరు అభ్యర్థులకు రాజకీయ, ఆర్థిక నేపథ్యం పెద్దగా లేకపోయినా ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉందన్నారు. తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకులు అభ్యర్థులకు వీరతిలకం దిద్ది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

డబ్బులకు లొంగకుండా ఓటు వేయాలి

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పట్టభద్రులు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారనే అపవాదును తొలగించుకోవాల్సిన బాధ్యత విద్యావంతులపై ఉందని కవిత సూచించారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి చేసినట్లు పేర్కొన్న రూ.200 కోట్ల ఖర్చు వ్యాఖ్యలపై ఆమె విమర్శలు చేశారు. పట్టభద్రులు ప్రలోభాలకు లొంగకుండా అభ్యర్థుల అర్హత, ఆలోచనా విధానం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఆధారంగా ఓటు వేయాలని కోరారు.

రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది డిగ్రీ విద్యార్హత కలిగినవారు ఉన్నారని, వారంతా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులుంటే గ్రాడ్యుయేట్ల ద్వారా ఎన్నికయ్యే సభ్యులు ముగ్గురేనని, అలాంటి కీలక స్థానాలకు ప్రజల తరఫున ప్రశ్నించే నాయకులను ఎన్నుకోవాలని అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం

శాసనమండలిలో బలమైన ప్రతిపక్ష స్వరం అవసరమని కవిత అభిప్రాయపడ్డారు. తమ అభ్యర్థులు విజయం సాధిస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్, నదీ జలాల హక్కులు, ప్రభుత్వ హామీల అమలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతారని తెలిపారు. దాదాపు 75 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుందని, అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేస్తాయని చెప్పారు.

భావసారూప్యత కలిగిన పార్టీల మద్దతు కూడా కోరనున్నట్లు వెల్లడించారు. మహిళలకు రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా తమ పార్టీ తరఫున 33 నుంచి 50 శాతం వరకు సీట్లు కేటాయించాలన్న ఆలోచన ఉందన్నారు. పార్టీ గుర్తింపు ప్రక్రియ ఎన్నికల సంఘం వద్ద కొనసాగుతోందని, సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జీలు డాక్టర్ రఘు, సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్లు గొంగళ్ల రంజిత్, అర్చనా సేనాపతి, వాసిలి చంద్రశేఖర్, రామ్ కళ్యాణ్ చల్లా, మతిన్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE