పోలీసు వాహనాల నిర్వహణలో ఆధునికీకరణకు మరో ముందడుగు..
ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నూతన కార్ హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం
ఆదిలాబాద్ | మన భారత్ | జూలై 3
జిల్లా పోలీసు శాఖలో వాహనాల నిర్వహణను మరింత వేగవంతంగా, నాణ్యతతో నిర్వహించేందుకు ఆదిలాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో నూతన కార్ హైడ్రాలిక్ లిఫ్ట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సదుపాయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు వాహనాల మరమ్మతులకు అవసరమైన విడిభాగాల నిల్వ, మెకానిక్ పనిచేసే గది, నిర్వహణ విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వాహనాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నూతన హైడ్రాలిక్ లిఫ్ట్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో పోలీసు వాహనాల మరమ్మతులు మరింత సులభంగా, వేగంగా, సాంకేతిక ప్రమాణాలతో నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని ఎస్పీ తెలిపారు. ఆధునిక పరికరాల వినియోగంతో వాహనాల పనితీరు మెరుగుపడటంతో పాటు, అత్యవసర సేవల్లో అంతరాయం లేకుండా పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయగలదని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో ఆధునిక సాంకేతిక సదుపాయాల వినియోగం పెంచడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. వాహనాల నిర్వహణలో నాణ్యత, సమయపాలన, భద్రతా ప్రమాణాలను పాటించాలని సంబంధిత సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) పి. మౌనిక, ఐపీఎస్, డీఎస్పీ కమటం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు టి. మురళి, ఎన్. చంద్రశేఖర్ తో పాటు రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
