e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

దేశవ్యాప్తంగా రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలి

కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు.. రైతుల అప్పుల మాఫీకి నిధుల కొరతా? – తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసులు

నాగర్‌కర్నూల్: దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే అన్ని రకాల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నప్పటికీ ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైతు సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన జీపు జాతాను ఎం. శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతాంగం వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చలేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలను ఒకేసారి మాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణ మాఫీలు, రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు రైతుల రుణాల విషయంలో మాత్రం నిధుల కొరతను సాకుగా చూపడం అన్యాయమని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకుని రైతుల ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నల్లగొండలో జరిగే ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల్లో భాగంగా నవంబర్ 15న లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు సీపీఎం సీనియర్ జాతీయ నాయకురాలు బృందా కారత్, ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్, రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరవుతారని వెల్లడించారు.

ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో రైతాంగ హక్కుల సాధన కోసం దేశవ్యాప్త ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై కూడా శ్రీనివాసులు స్పందించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా, కొన్నింటినే కరువు మండలాలుగా ప్రకటించడం రైతులకు నష్టం కలిగిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రులు తక్షణమే స్పందించి జిల్లాలోని మొత్తం 20 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేయాలని, 60 ఏళ్లు దాటిన రైతులందరికీ నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయడంతో పాటు రైతులకు బ్యాంకు రుణాలు సకాలంలో అందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వి. పర్వతాలు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె. గీత, మాజీ ఎంపీటీసీ యాదయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారి పి. రామయ్య, నాగర్‌కర్నూల్ సీపీఎం మండల కార్యదర్శి ఎన్. మధు, బిజినపల్లి కార్యదర్శి జి. అశోక్, తాడూరు కార్యదర్శి అంతటి కాశన్న, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సి. బాల్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వి. వెంకటేష్, కృష్ణారెడ్డి, నాయకులు రమణారెడ్డి, వై. నాగేంద్రం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE