e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

నవంబర్ 9న జిల్లాకు మంత్రి శ్రీధర్‌బాబు రాక

ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

మన భారత్ ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుందని, ఈనెల 9వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో ఆదిలాబాద్‌కు కొత్త అవకాశాలు తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ భవనం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఐటీ టవర్ అందుబాటులోకి రావడం వల్ల యువతకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక రంగంలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కేటీఆర్ విమర్శలపై ఎదురుదాడి

ఇటీవల ఆదిలాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నరేష్ జాదవ్ ఘాటుగా స్పందించారు. ఇంద్రవెల్లిలో కేటీఆర్ సోదరి చేసిన విమర్శలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చనాకా–కోరాట బ్యారేజీ నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల అంచనా నుంచి రూ.1,800 కోట్లకు పెరిగిందని, అయినప్పటికీ జిల్లాలో ఆశించిన స్థాయిలో సాగునీరు అందలేదని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం భారీ అప్పుల భారాన్ని మోసే పరిస్థితికి చేరుకుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, బ్యారేజీల నాణ్యత, సాగునీటి పంపిణీ వంటి అంశాలపై గత పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో బాధ్యత వహించకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయంగా తగదని పేర్కొన్నారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి

ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని, వాటిని రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదని నరేష్ జాదవ్ అన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరువు ప్రభావిత మండలాలను గుర్తించి రైతులకు సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

దీపావళి సందర్భంగా నూతనంగా ఇందిరమ్మ ఇళ్లలోకి ప్రవేశించిన పేద కుటుంబాలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. అర్హులైన ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యత

అధికారం కోల్పోయిన అసహనంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని నరేష్ జాదవ్ వ్యాఖ్యానించారు. గత పాలనలో ఇచ్చిన హామీలు, ప్రాజెక్టుల వ్యయాలు, రైతులకు అందని సాగునీరు, నిరుద్యోగ సమస్యలపై సమాధానం చెప్పాలని సూచించారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఐటీ టవర్ ప్రారంభోత్సవం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజర్ పాషా, సుధాకర్ గౌడ్, మంగేష్ కుమార్, మునిగేల నర్సింగ్, పరమేశ్వర్, బండి దేవదాస్ చారి, అత్తర్ అలీ, మల్యాల కరుణాకర్, గౌలి సంజీవ్ కుమార్, బెజ్జంకి అనిల్ కుమార్, గుడిపల్లి నగేష్, సామ రూపేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE