e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

సమ్మె పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడాలి

సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు: సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య

నాగర్‌కర్నూల్, మన భారత్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి సమ్మె పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజా సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం వైద్య సిబ్బంది చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పొదిల రామయ్య మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వారికి న్యాయం చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించి పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించడంతోపాటు వేతనాలను పెంచి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. వైద్య సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

వేతనాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరగాలని, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఎన్‌హెచ్‌ఎం కేడర్ ఉద్యోగికి 100 శాతం గ్రాస్ జీతం అందించాలని రామయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ప్రతి మూడేళ్లకోసారి బదిలీలు చేసే విధానాన్ని రద్దు చేయాలని, బదిలీ చేయబడిన ఉద్యోగులను తిరిగి వారి పాత స్థానాల్లో నియమించాలని కోరారు. జీఓ నంబర్ 1195ను పునఃపరిశీలించి ఉద్యోగులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాతో అందించాల్సిన ఇంక్రిమెంట్లు ఉద్యోగులకు సక్రమంగా అందడం లేదని ఆయన ఆరోపించారు. సుమారు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం వారి శ్రమకు తగిన పారితోషికం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 108 రోజుల ప్రసూతి సెలవులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు వారి పోరాటానికి సీఐటీయూ అండగా ఉంటుందని పొదిల రామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు, ఎన్‌హెచ్‌ఎం జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, శ్రీనివాసులు, దేవుడు, వనజ, అరుణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE