e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలి

కల్తీ మిర్చి విత్తనాలపై న్యూ ఆనంద్ డిస్ట్రిబ్యూటర్ స్పందించాలి

పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలి

సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్

మన భారత్ తాడూరు, నవంబర్ 25: నకిలీ లేదా నాణ్యతలేని మిర్చి విత్తనాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణమే న్యాయం చేయాలని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న డిమాండ్ చేశారు. తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో కుబేరు, రాఖీ, సింభా రకాల మిర్చి విత్తనాలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 50 ఎకరాలకు పైగా మిర్చి పంట నష్టానికి గురైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అంతటి కాశన్న మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులు ప్రతి సీజన్‌లో ఎన్నో ఆశలతో పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మిర్చి సాగు కోసం రైతులు ప్రైవేటు అప్పులు చేసి, అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల రూపంలో భారీగా పెట్టుబడులు పెట్టారని తెలిపారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఆశించిన స్థాయిలో ఎదుగుదల, దిగుబడి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని అన్నారు.

గుంతకోడూరు గ్రామంలో కుబేరు, రాఖీ, సింభా మిర్చి విత్తనాలు సాగు చేసిన పలువురు రైతులకు పంటలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. విత్తనాల నాణ్యతపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కోరారు. పంట నష్టానికి గల అసలు కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించి, బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విత్తనాలకు సంబంధించిన న్యూ ఆనంద్ డిస్ట్రిబ్యూటర్ చిన్నపరెడ్డి వెంటనే స్పందించాలని అంతటి కాశన్న డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించే బాధ్యత తీసుకోవాలని కోరారు. విత్తనాల సరఫరా, నాణ్యత, విక్రయాలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.

రైతులు పంట సాగు చేసే సమయంలో నాణ్యమైన విత్తనాలు అందించడం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్ల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. విత్తనాల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు.

రైతుల కష్టాలను పట్టించుకోకుండా వదిలేయడం సమంజసం కాదని, పెట్టుబడులు కోల్పోయి అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధిత రైతులందరికీ న్యాయం జరిగే వరకు సీపీఎం పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని అంతటి కాశన్న స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బాధిత రైతులు చెన్న మల్లేష్, ఎండీ షబీర్, కొరపాల బాలరాజు, గణేష్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE