మన భారత్ , తెలంగాణ:
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలి రోజు ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ (Leadership in the 21st Century) కోర్సు ప్రారంభమైంది.
ఈ కోర్సులో భాగంగా ‘అధికార విశ్లేషణ – నాయకత్వం’ అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. సమకాలీన పాలన, నాయకత్వ సవాళ్లు, నిర్ణయాల ప్రక్రియపై లోతైన అవగాహన కల్పించేలా ఈ సెషన్ సాగింది. కేస్ అనాలిసిస్, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి శిక్షణాత్మక కార్యక్రమాల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు.
ప్రపంచ స్థాయి విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబల్ లీడర్‌షిప్ ధోరణులు, పాలనా నూతన ఆలోచనలు తెలుసుకునే అవకాశం లభిస్తోందని పాల్గొన్నవారు పేర్కొన్నారు. ప్రజాపాలనలో ఉత్తమ విధానాల అమలుకు ఈ శిక్షణ ఉపయోగపడనుందని అభిప్రాయం వ్యక్తమైంది.
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపునిచ్చే అంశంగా రాజకీయ, విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.
