e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

అన్ని జిల్లా కేంద్రాల నుంచి AIIMS బీబీనగర్‌కు నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలి

ఉప్పల్–ఎయిమ్స్ మధ్య ప్రతి 30 నిమిషాలకు ప్రత్యేక షటిల్ సర్వీసులు ఏర్పాటు చేయాలి

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీకి మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ లేఖ

మన భారత్ హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎయిమ్స్ (AIIMS) బీబీనగర్‌కు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు బి. వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు మరింత చేరువ కావాలంటే మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు.

ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డికి వినోద్ కుమార్ లేఖ రాశారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎయిమ్స్ బీబీనగర్‌కు నేరుగా బస్సులు నడపడంతో పాటు, హైదరాబాద్‌లోని ఉప్పల్ జంక్షన్ నుంచి ఆసుపత్రికి ప్రతి 30 నిమిషాలకు ప్రత్యేక షటిల్ బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ అని తెలిపారు. ఇక్కడ అందుబాటులోకి వస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు. అయితే ఆసుపత్రికి చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలను గుర్తుచేస్తూ 2016లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి ఈ సంస్థ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారని వినోద్ కుమార్ వివరించారు. అప్పటి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎయిమ్స్ మంజూరుకు కృషి చేశారని తెలిపారు. ఆ ప్రయత్నాల ఫలితంగా తెలంగాణకు ఎయిమ్స్ మంజూరైందని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో సుమారు 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు.

ఎయిమ్స్‌కు వచ్చే వృద్ధులు, పేదలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన రోగులు ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకటి కంటే ఎక్కువ బస్సులు మారి ఆసుపత్రికి చేరుకోవాల్సి రావడం రోగులకు శారీరకంగా, ఆర్థికంగా భారంగా మారుతుందని వివరించారు.

ఈ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి నేరుగా బస్సులు ప్రారంభించాలని, ఉప్పల్ నుంచి ఎయిమ్స్ వరకు రోజంతా తరచుగా షటిల్ సర్వీసులు నడపాలని కోరారు. ఆసుపత్రి ఓపీడీ సమయాలకు అనుగుణంగా బస్సుల వేళలను రూపొందించాలని సూచించారు. తెల్లవారుజామునే ఆసుపత్రికి చేరుకునేలా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్నం, సాయంత్రం తిరుగు ప్రయాణానికి అనువైన బస్సులు అందుబాటులో ఉంచాలని కోరారు.

అదేవిధంగా పొరుగు జిల్లాల్లోని ముఖ్య పట్టణాలు, రవాణా కేంద్రాలకు కూడా బస్సు కనెక్టివిటీని విస్తరించాలని సూచించారు. ప్రధాన బస్ స్టేషన్లు, ఉప్పల్ జంక్షన్, ఎయిమ్స్ ప్రాంగణంలో బస్సు మార్గాలు, సమయాలు, చార్జీల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని కోరారు.

ఎయిమ్స్ యాజమాన్యంతో సమన్వయం చేసుకొని ప్రత్యేక రవాణా ప్రణాళిక రూపొందించాలని, ప్రయాణికుల అవసరాలపై అధ్యయనం నిర్వహించి దశలవారీగా సర్వీసులు ప్రారంభించాలని సూచించారు. ఈ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎయిమ్స్ బీబీనగర్ అధికారిక ప్రారంభ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి ముందే రవాణా ప్రణాళిక సిద్ధం చేసి తొలి విడత బస్సు సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ ప్రాధాన్యత కలిగిన వైద్య సంస్థ సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యాల కొరతతో అందనంత దూరంలో ఉండకూడదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన వారైనా, ఏ ఆర్థిక స్థితిలో ఉన్న వారైనా సులభంగా ఆసుపత్రికి చేరుకొని నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

TGSRTC

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE