e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

కల్తీ మిర్చి విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం..

బాధ్య కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు

రైతులకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన

తాడూరు, అక్టోబర్ 26, మన భారత్ ప్రతినిధి:

నాణ్యత లేని మిర్చి విత్తనాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు డిమాండ్ చేశారు. రైతులను నష్టాలపాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కలాష్, కుబేర్ 305, ఈషా, రాఖీ రకం మిర్చి విత్తనాల కంపెనీలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే సంబంధిత కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాడూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ప్రజావాణి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో గుంతకోడూరు గ్రామానికి చెందిన మిర్చి రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటల పరిస్థితిని వివరించి, పెట్టుబడులు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ధర్నాలో పాల్గొన్న వి. పర్వతాలు మాట్లాడుతూ.. రైతులు ఎంతో ఆశతో మిర్చి సాగు చేపట్టినా, విత్తనాల నాణ్యతపై అనుమానాలు తలెత్తడంతో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సంబంధిత కంపెనీలకు చెందిన మిర్చి విత్తనాలను సాగు చేసి మూడు నెలలు గడుస్తున్నా పంటకు ఆశించిన విధంగా కాపు రావడం లేదని రైతులు చెబుతున్నట్లు తెలిపారు. ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారని వివరించారు.

రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భరించి పంటను సాగు చేశారని, ప్రస్తుతం ఆశించిన ఫలితం లేకపోవడంతో పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి

వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించి మిర్చి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పర్వతాలు కోరారు. విత్తనాల నాణ్యత, పంట ఎదుగుదల, కాపు రాకపోవడానికి గల కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి, సమగ్ర నివేదిక రూపొందించాలని డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రామాల్లో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) రైతుల సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతగా వ్యవహరించి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

న్యాయం జరిగే వరకు పోరాటం

కల్తీ లేదా నాణ్యత లోపించిన విత్తనాల కారణంగా రైతులు నష్టపోయినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పర్వతాలు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు స్పందించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతుల సమస్యను ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ధర్నా అనంతరం రైతులు తమ పంటల పరిస్థితిని వివరించి, నష్టంపై తగిన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాములు, శ్యాంసుందర్, చాంద్ పాషా, రాజు, వెంకట్, నరసింహులు, శివకుమార్, రమేష్, జబ్బార్, మల్లేష్, బాలరాజు, వెంకటయ్య తదితర మిర్చి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు, నాయకులు చెన్న శ్యాంసుందర్, చెన్న బాలరాజు, రాజు, మల్లేష్, వెంకటయ్య, జబ్బార్, జాఫర్, చెన్న రాములు, ఎం.డి. జాంగిర్, గోరంట్ల వెంకటయ్య, కొరుపాల బాలరాజు, చింతకాయల చంద్రయ్య, గూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE