e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

తెలంగాణ భాషా సాహిత్యానికి విశేష సేవలు.. ఉదారి నారాయణకు కాళోజీ స్మారక అవార్డు

వరంగల్‌లో అంపశయ్య నవీన్ చేతుల మీదుగా పురస్కారం ప్రదానం – రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేత

మన భారత్ వరంగల్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ ఉదారి నారాయణకు ప్రతిష్ఠాత్మక కాళోజీ నారాయణరావు స్మారక అవార్డు లభించింది. శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన ఈ అవార్డు కింద రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు.

తెలంగాణ భాషా సాహిత్య రంగానికి తన రచనల ద్వారా విశేష సేవలందిస్తున్న డాక్టర్ ఉదారి నారాయణకు ఈ పురస్కారం దక్కడం పట్ల సాహితీవేత్తలు, కవులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ నిర్వాహకులు నాగిళ్ల రామశాస్త్రి, ప్రముఖ కవి, రచయిత వి.ఆర్. విద్యార్థి, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసు తదితరులు పాల్గొని ఆయనను అభినందించారు.

డాక్టర్ ఉదారి నారాయణకు కాళోజీతో ఉన్న సాహిత్య అనుబంధం ప్రత్యేకమైనది. తన తొలి కవితా సంపుటి ‘ఆకుపచ్చని ఎడారి’కి స్వయంగా కాళోజీ నారాయణరావుతో ముందుమాట రాయించుకోవడం ఆయన సాహిత్య ప్రయాణంలో ఒక విశిష్ట ఘట్టం. అప్పటి నుంచి నేటి వరకు కాళోజీ ఆలోచనలు, భావజాలం, సామాజిక స్పృహను తన రచనల్లో ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతున్నారు.

తెలంగాణ యాస, భాష, సంస్కృతి, గ్రామీణ జీవన విధానాలకు తన రచనల్లో పెద్దపీట వేస్తూ స్థానిక భాషా వైభవాన్ని సాహితీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని అవార్డు నిర్వాహకులు కొనియాడారు. తెలంగాణ పదాలను సహజంగా, వినసొంపుగా ఉపయోగిస్తూ తన రచనలకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేవలం వచన కవిత్వానికే పరిమితం కాకుండా నాటికలు, ముచ్చట్లు, గేయాలు, కథలు వంటి విభిన్న సాహిత్య ప్రక్రియల్లోనూ పల్లె భాష సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ భాషకు అస్తిత్వం, స్థిరత్వం కల్పించడంలో ఆయన రచనలు తమదైన పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అవార్డు స్వీకరించిన డాక్టర్ ఉదారి నారాయణ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు అంటే నిర్భయంగా ప్రశ్నించే గొంతుకకు, నిజాయితీకి, ప్రజా చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ప్రజల మనిషిగా పేరుగాంచిన అటువంటి మహోన్నత కవి పేరుతో ఏర్పాటైన స్మారక పురస్కారం అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని తెలిపారు.

కాళోజీ ఆశయాలు, ఆలోచనలు, తెలంగాణ భాషా స్ఫూర్తిని తన రచనల ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల జీవన విధానం, గ్రామీణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, తెలంగాణ సమాజ చైతన్యాన్ని ప్రతిబింబించేలా భవిష్యత్తులోనూ రచనలు కొనసాగిస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, రామరెడ్డి, చారి తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి ఉదారి నారాయణకు కాళోజీ స్మారక అవార్డు లభించడం జిల్లా సాహితీ రంగానికి గర్వకారణంగా పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE