e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

చర్లపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం..

రూ.25 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం.. రూ.3.50 లక్షలతో మ్యాజిక్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

మన భారత్ జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, భూమిపూజలు నిర్వహించారు.

గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోనే తొలిసారిగా రూ.3.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తయితే గ్రామంలో మురుగునీటి నిర్వహణ మెరుగుపడి పారిశుధ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే గ్రామంలో మున్నూరుకాపు, రెడ్డి కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించగా, ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మరో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా భూమిపూజ నిర్వహించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం గ్రామానికి చెందిన దీటి లావణ్య–రాజయ్య, గడ్డం అంజయ్య–ఈశ్వరి దంపతుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నూతన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను కానుకగా అందజేశారు. సొంతింటి కల నెరవేరడంతో పేద కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. చర్లపల్లి గ్రామంలో జిల్లాలోనే మొదటిసారిగా మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో నిత్యం పారిశుధ్య నిర్వహణ కొనసాగితే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆధునిక పారిశుధ్య విధానాలకు అనుగుణంగా మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం గ్రామీణ అభివృద్ధిలో కొత్తదనానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.

గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, మహిళా సంఘాలకు అవసరమైన భవనాల నిర్మాణంలో అధికారులు చొరవ తీసుకొని పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనందరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీమ్, ఎంపీవో రవిబాబు, డీఈ మిలింద్, సర్పంచుల ఫోరం నాయకులు బొలిశెట్టి గంగారెడ్డి, కట్ట రాజేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాల ముకుందం, ఏఈ విజయ్, మాజీ సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ దుమాల సుమన్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE