e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలి

తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పాలి.. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి: మంత్రి వాకిటి శ్రీహరి

మన భారత్, హైదరాబాద్, నవంబర్ 10:

తెలంగాణ రాష్ట్రానికి దక్కిన ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం గర్వించేలా పోటీలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు సూచించారు. ఈ క్రీడా పోటీల ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, ప్రత్యేక చొరవతోనే ఖేలో ఇండియా నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు దక్కాయని పేర్కొన్నారు.

బేగంపేటలోని హరిత ప్లాజాలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ అధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలాదేవి, వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ తెలంగాణకు రావడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావించాలని అన్నారు. గతంలో శ్రీనగర్‌లో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి ఈ పోటీల నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ అవకాశం లభించిందని తెలిపారు.

ఈ కార్యక్రమం నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి అధికారి పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. క్రీడా పోటీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ పనుల నిర్వహణకు డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు కల్పిస్తోందని వెల్లడించారు. అనవసర ఖర్చులకు తావివ్వకుండా తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

యువతను క్రీడల వైపు మళ్లించాలి

ప్రస్తుత యువత సోషల్ మీడియా రీల్స్, బెట్టింగ్ వంటి వ్యసనాల బారిన పడకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మంత్రి సూచించారు. బెట్టింగ్ మహమ్మారి నుంచి యువతను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడలు మంచి మార్గమని పేర్కొన్నారు. మణిపూర్‌లో గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడా సంస్కృతిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలోని ప్రతి గ్రామంలో క్రీడా వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని సూచించారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: శివసేన రెడ్డి

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. స్టేడియాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి పనిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రూ.203 కోట్లతో ఏర్పాట్లు

ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ కోసం మొత్తం రూ.203 కోట్లతో ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.120 కోట్లను క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

11 స్టేడియాలు సిద్ధం.. మరో ఐదింటిలో పనులు

స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి మాట్లాడుతూ ఖేలో ఇండియా నిర్వహణ కోసం ఇప్పటికే 11 స్టేడియాలను సిద్ధం చేశామని, మరో ఐదు స్టేడియాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఎంఎస్ (IMS) పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పనికి సంబంధించిన వివరాలను పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ క్రీడా రంగానికి కొత్త గుర్తింపు తీసుకురావాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE