e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వయోవృద్ధులు వ్యక్తిగత, బ్యాంకు వివరాలను అపరిచితులకు వెల్లడించవద్దు
సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4,

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా వయోవృద్ధులు సైబర్ మోసాల పట్ల ప్రత్యేక అప్రమత్తత పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకోవడం ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు.

ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రత్త దివాస్‌లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రణామం కేంద్రంలో వయోవృద్ధులకు సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వినియోగించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదం ఉందన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లు, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖల ప్రతినిధులమంటూ ఫోన్ చేసి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తారని తెలిపారు. అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు వెల్లడించకూడదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ షాపింగ్‌లో తక్కువ ధరలు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను నమ్మకుండా అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే కొనుగోళ్లు చేయాలని సూచించారు.

యూపీఐ చెల్లింపుల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. డబ్బులు స్వీకరించడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదని, డబ్బులు పంపే సమయంలో మాత్రమే సరైన వివరాలను నమోదు చేయాలని వివరించారు. అపరిచితులు పంపే లింకులను తెరవడం, అవసరం లేని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోవడం చేయరాదని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే స్పందించాలి

ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే [www.cybercrime.gov.in](https://www.cybercrime.gov.in) వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు.

ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

అనంతరం ప్రణామం కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ వయోవృద్ధులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో కలిసి చెస్, క్యారమ్స్ ఆడి ఉత్సాహపరిచారు. వయోవృద్ధులకు ఏవైనా సమస్యలు లేదా అవసరాలు ఎదురైతే పోలీసు శాఖను నిర్భయంగా సంప్రదించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వయోవృద్ధుల సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే, సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE