e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును పూర్తిగా తొలగించే వరకు పోరాటం ఆగదు

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడొద్దు.. కేంద్రం నుంచి నిధులు ఇప్పించే బాధ్యత మాది: ఎంపీ ఈటల రాజేందర్

దమ్మాయిగూడ, మన భారత్:

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడలో నిర్వహించిన మహా పాదయాత్ర ముగింపు సభలో పలువురు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన నాయకులు డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఈటల రాజేందర్.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిరోజూ సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు చేరుతుండటంతో భారీగా పేరుకుపోయిన చెత్త నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా స్థానిక ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న లీచేట్ నీరు భూగర్భ జలాల్లోకి చేరి చెరువులు, బోరు నీటిని కలుషితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల స్థానికులు కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

చిన్నపిల్లలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, వీధికుక్కల సమస్య కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ప్రజలకు కనీసం స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

బయోమైనింగ్, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త తొలగింపు పేరుతో భారీగా ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా చెత్తను తిరిగి ఉపయోగించుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, చెత్తలోని ప్రతి భాగాన్ని రీసైక్లింగ్ ద్వారా ఉపయోగించుకునే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాంకీ సంస్థ నిర్వహణ తీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ, సంస్థపై ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఈ సమస్యను కేవలం కాంట్రాక్టులు, నిధుల కోణంలో చూడకుండా లక్షలాది మంది ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా పరిగణించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని కోరారు. అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకురావడానికి తాము బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షలాది మంది ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవసరమైనా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలకే పరిమితమవుతోందని విమర్శించారు.

ప్రజలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా తొలగించి, స్థానిక ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ మహా పాదయాత్ర ముగింపు సభలో ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రామారావు పాటిల్, సూర్యనారాయణ గుప్తా తదితర బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE