e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు వేగం పెంచండి..

హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్‌మెంట్ త్వరగా ఖరారు చేయాలి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

కొత్త రైలుమార్గాలు, రీజినల్ రింగ్ రైలు, మహబూబాబాద్ మెగా డిపోకు అనుమతులు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి

మన భారత్ న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్ల పనులను వేగవంతం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న కీలక రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

హైదరాబాద్‌–పుణె, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించిందని ముఖ్యమంత్రి వివరించారు. కొన్ని మార్పులు, సూచనలతో కూడిన ప్రతిపాదనలను తిరిగి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైలు మార్గాల అలైన్‌మెంట్‌ను ఆమోదించిన వెంటనే భూసేకరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

వికారాబాద్‌–కృష్ణా రైలుమార్గానికి ప్రాధాన్యం

వికారాబాద్‌ నుంచి కృష్ణా వరకు సుమారు 130 కిలోమీటర్ల మేర కొత్త రైలుమార్గాన్ని వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసర ప్రాంతాల్లో భారీగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే అనుసంధానం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

రీజినల్ రింగ్ రైలుకు అలైన్‌మెంట్ చేయాలి

హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 360 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పక్కనే రీజినల్ రింగ్ రైలుకు కూడా అలైన్‌మెంట్ రూపొందించాలని రేవంత్ రెడ్డి కోరారు. రింగ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయని తెలిపారు. దీనివల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు.

పలు కొత్త రైల్వే మార్గాలకు విజ్ఞప్తి

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం పెంచేందుకు పలు కొత్త మార్గాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి మరోసారి కేంద్ర మంత్రిని కోరారు. డోర్నకల్‌–గద్వాల్‌, కల్వకుర్తి–మాచర్ల, కాచిగూడ–జగ్గయ్యపేట (250 కి.మీ.), పటాన్‌చెరు–ఆదిలాబాద్ (320 కి.మీ.), బోధన్‌–లాతూర్ (175 కి.మీ.) రైలుమార్గాలతో పాటు ఎనిమిది కిలోమీటర్ల అక్కన్నపేట బైపాస్ లైన్‌కు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అనంతారంలో మెగా రైల్వే డిపో ఏర్పాటు చేయాలి

దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ సమీపంలోని అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన 409.1 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. డిపో ఏర్పాటుకు అవసరమైన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించి, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE