e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట.. రూ.75 లక్షలతో ఉర్దూ ఘర్ నిర్మాణం

63 మంది ముస్లిం ఆడబిడ్డలకు రూ.63 లక్షల షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జగిత్యాలలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం.. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

మన భారత్ జగిత్యాల: పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ ఘర్ భవన నిర్మాణానికి ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం షాదీ ముబారక్ పథకం కింద 63 మంది ముస్లిం ఆడబిడ్డలకు మంజూరైన రూ.63 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.235 కోట్ల వ్యయంతో 400 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు ఆధునిక వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

2,600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య

విద్యారంగ అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొన్ని వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

ఈ విద్యాసంస్థ ద్వారా సుమారు 2,600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యారంగంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

మసీదు నిర్మాణానికి స్థలం, నిధులు

పేద, మధ్యతరగతి కుటుంబాలకు గృహ వసతులు కల్పించేందుకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో మసీదు నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన నిధులు కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు.

జగిత్యాల ఖిల్లా అభివృద్ధికి రూ.40 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఖిల్లాను అభివృద్ధి చేసి, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే పనులకు భూమిపూజ నిర్వహిస్తామని చెప్పారు.

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

కులమతాలకు అతీతంగా పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయడమే తన లక్ష్యమని డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మైనారిటీలకు విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఈఈ రహమాన్, ఈఈ లక్ష్మణ్ రావు, డీఈ మిలింద్, ఎంఆర్ఓ రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జీనత్ పర్వీన్ మున్నా, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ముజీబ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అలాగే కౌన్సిలర్లు పంబాల సుజాత రాము, అనీస్ కుతిజా, కమాళోద్దీన్, కొండ అరుణ, బడుగు పద్మ, రాజేందర్, ఆయుబ్ ఖాన్, రజియుద్దీన్, వసికుద్దిన్ అన్సారీ, క్యాదసు నవీన్, మమత రామకృష్ణ రెడ్డి, షాహిన్ బేగం అఫ్రోజ్, రాగుల ప్రదీప్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు మన్సూర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మోసిన్, ఖాజిమ్ అలీ, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుసరి అనిల్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు సుమేర్, మైనారిటీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE