e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

విద్యార్థులకు తోబుట్టువుగా ‘పోలీస్ అక్క’..

విద్యార్థులకు తోబుట్టువుగా ‘పోలీస్ అక్క’.. మహిళల భద్రతలో ఆదిలాబాద్ షీ టీం సేవలు మరింత విస్తరణ

జూలైలో 95 ఈ-పెట్టీ కేసులు నమోదు – 157 హాట్‌స్పాట్లలో ప్రత్యేక నిఘా – 71 అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన షీ టీం

ఆదిలాబాద్, ఆగస్టు 6 (మన భారత్): జిల్లాలో మహిళలు, బాలికలు భయాందోళనలేని వాతావరణంలో జీవించేలా పోలీసు శాఖ అనేక చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు. మహిళల భద్రతకు అండగా నిలుస్తున్న ఆదిలాబాద్ షీ టీం సేవలను మరింత బలోపేతం చేస్తూ, గ్రామాల నుంచి విద్యాసంస్థల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో షీ టీం జూలై నెల పనితీరును సమీక్షించిన ఎస్పీ, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాల నివారణలో షీ టీం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు భద్రతతో పాటు చట్టపరమైన సహాయం, కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యమని వివరించారు.

95 ఈ-పెట్టీ కేసులు.. ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు

జూలై నెలలో ఆకతాయిలపై 95 ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మహిళల వేధింపులకు సంబంధించిన ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అందిన ఫిర్యాదులపై స్పందిస్తూ మొత్తం 23 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో 21 మంది మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలతో పాటు సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా కౌన్సిలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

157 హాట్‌స్పాట్లలో నిఘా.. 57 గ్రామాల్లో అవగాహన

మహిళల వేధింపులు ఎక్కువగా జరిగే అవకాశమున్న 157 హాట్‌స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని 57 గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తూ మహిళల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు.

పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, గ్రామాల్లో మొత్తం 71 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళల హక్కులు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా మోసాలు, బాల్య వివాహాల నిరోధం, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చైతన్యం కల్పించినట్లు చెప్పారు.

సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలి

ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకోవడం వంటి విషయాల్లో యువతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే షీ టీం లేదా సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 లేదా 8712659953 నంబర్‌కు సమాచారం అందించాలని, బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‘పోలీస్ అక్క’పై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అమలవుతున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఆదర్శంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. గ్రామాలను తరచుగా సందర్శిస్తూ మహిళలు, యువతులతో సమావేశాలు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో మమేకమై వారు పోలీస్ అక్కను తమ కుటుంబ సభ్యురాలిగా, తోబుట్టువుగా భావించేలా విశ్వాసం పెంపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, సోషల్ మీడియా వేదికల్లో మహిళలు, విద్యార్థినులపై జరిగే వేధింపులను అరికట్టేందుకు మరింత అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ఉత్తమ ప్రతిభకు ప్రశంసలు

జూలై నెలలో విశేష ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ జయలక్ష్మి, కానిస్టేబుళ్లు మమత, పూజలను ఎస్పీ ప్రశంసాపత్రాలతో సత్కరించి అభినందించారు. ఇలాంటి సేవాభావంతో పనిచేస్తూ మహిళల భద్రతకు మరింత కృషి చేయాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) పి. మౌనిక, ఐపీఎస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, షీ టీం ఇన్‌చార్జి బి. సుశీల, వాణిశ్రీ, షీ టీం సిబ్బంది రోహిణి తదితరులు పాల్గొన్నారూ

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE