e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన, నిందితులకు 15 రోజుల రిమాండ్

మన భారత్, చీపురుపల్లి:

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీపురుపల్లి పట్టణంలోని విజయ కాలనీలో పోలీసులు విస్తృతంగా “కార్డెన్ అండ్ సెర్చ్’ నిర్వహించి గంజాయి అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా గంజాయి కలిగి ఉన్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శంకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో విజయ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. ప్రజల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు.

తనిఖీల్లో భాగంగా రెడ్డిపేట కాలువ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించినట్లు తెలిపారు. ఈ కేసులో చందక సాయిరాం, సెట్గోపం కార్తీక్, రెడ్డి పాపి నాయుడు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు 15 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, బుదరాయవలస పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

మీ విశాల్ కుమార్ , ఎడిటర్ , మన భారత్..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE