e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

సమసమాజ నిర్మాణమే మహాత్మా ఫూలేకు నిజమైన నివాళి

సమసమాజ నిర్మాణమే మహాత్మా ఫూలేకు నిజమైన నివాళి

ఆదిలాబాద్‌లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి వేడుకలు – ఫూలే దంపతుల ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపు

ఆదిలాబాద్, నవంబర్ 28, మన భారత్:

సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం పరిఢవిల్లినప్పుడే మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని యవత్మాల్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ రాజేంద్ర మహాడోలే అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన స్మారక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివిధ సామాజిక, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర మహాడోలే మాట్లాడుతూ.. పూణే నగరం నుంచి విద్యాజ్యోతిని వెలిగించి యావత్ భారతదేశానికి ప్రగతి మార్గాన్ని చూపించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. తన సహధర్మచారిణి సావిత్రీబాయి ఫూలే సహకారంతో ఆయన ప్రారంభించిన విద్యా ఉద్యమం దేశంలో సామాజిక మార్పునకు బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. మహిళలు, అణగారిన వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో ఫూలే దంపతులు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఆనాడు వారు ఎదుర్కొన్న అనేక సామాజిక అవరోధాలను అధిగమించి విద్యా వ్యాప్తికి కృషి చేయడం వల్లే నేడు సమాజంలోని అన్ని వర్గాలకు విద్యావకాశాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. విద్య అనేది కేవలం ఉద్యోగాలు పొందడానికి మాత్రమే కాకుండా, మనిషిలో ఆలోచనా శక్తిని, ప్రశ్నించే తత్వాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించే సాధనమని అన్నారు. ఫూలే దంపతులు వేసిన విద్యా పునాదులే దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్విశతాబ్ది జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని ప్రత్యేక ద్విశతాబ్ది సంవత్సరంగా ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. 2027 ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. ఫూలే, సావిత్రీబాయి దంపతుల అసమాన త్యాగాలు, సామాజిక సేవలు దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ప్రశంసనీయమన్నారు.

సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, అనాచారాలు, అసమానతలను తొలగించేందుకు ఫూలే దంపతులు తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు. ప్రజలు మూఢ విశ్వాసాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా విలువలను అలవర్చుకోవాలని సూచించారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే ఆశయాలను, ఆలోచనలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వారి జీవిత చరిత్రను యువతకు, విద్యార్థులకు తెలియజేయడంతో పాటు విద్య, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత దిశగా కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షెండే, మాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అంబేకర్, భాస్కర్ ప్రధాన్, అనీల్ కోట్రంగే, కల్పనా పేట్కులే, మమతా మహాడోలే, బహుజన సాహితీవేత్త, ప్రముఖ కవి మధు బావల్కర్, విశ్రాంత బ్యాంకు అధికారి సోమయ్య ఘూలే తదితరులు పాల్గొన్నారు. పలువురు సామాజిక కార్యకర్తలు, సంఘ సభ్యులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా ‘జై జ్యోతి.. జై విప్లవం’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE