e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత..

ఆదిలాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక.. జీఎస్ కాలనీలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 21,

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని జీఎస్ కాలనీలో దాదాపు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూషతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.

అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణానికి ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను తొలగించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆదిలాబాద్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, ఇండస్ట్రీ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు మంజూరయ్యాయని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను ఎలాంటి రాజకీయ, ప్రాంతీయ వివక్షకు తావులేకుండా సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన వార్డులకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

భవిష్యత్తులో ఆదిలాబాద్ పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అమృత్ పథకం కింద సుమారు రూ.300 కోట్ల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సాత్నాల, మత్తడివాగు, కోటాచానాక ప్రాజెక్టుల నుంచి పట్టణానికి అవసరమైన మేరకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

జీఎస్ కాలనీలో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకల సౌకర్యంతో పాటు మురుగునీటి పారుదల సమస్యలు తగ్గనున్నాయి. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE