e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

చిట్ ఫండ్స్ పేరుతో లక్షలాది రూపాయల టోకరా.. భర్త అరెస్ట్

చిట్ ఫండ్స్ పేరుతో లక్షలాది రూపాయల టోకరా.. భర్త అరెస్ట్

మోసపూరిత చిట్ వ్యాపారంపై ఇచ్చోడ పోలీసుల చర్యలు – గతంలో భార్య అరెస్ట్, తాజాగా భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 19, చిట్ ఫండ్స్ పేరుతో ప్రజలకు అధిక లాభాలు ఆశ చూపించి లక్షలాది రూపాయలు వసూలు చేసి, గడువు ముగిసినప్పటికీ తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడిన దంపతుల వ్యవహారంలో ఇచ్చోడ పోలీసులు మరో కీలక చర్య తీసుకున్నారు. ఈ కేసులో గతంలో భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా ఆమె భర్త రహంగ్‌డాలే నరేంద్ర (46)ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇచ్చోడ మండలంలోని విద్యానగర్ కాలనీలో వెలుగులోకి వచ్చింది.

ఆకర్షణీయమైన లాభాల పేరుతో డబ్బుల వసూలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విద్యానగర్ కాలనీకి చెందిన రహంగ్‌డాలే నరేంద్ర, అతని భార్య వైష్ణవి కలిసి కిరాణా దుకాణం, బ్యూటీ పార్లర్ నిర్వహించడంతో పాటు చిట్ ఫండ్స్ వ్యాపారం కూడా కొనసాగించేవారు. ఈ క్రమంలో ప్రజలకు అధిక లాభాలు వస్తాయని, చిట్ గడువు పూర్తయిన వెంటనే డబ్బులు సకాలంలో తిరిగి చెల్లిస్తామని నమ్మబలికి పలువురి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రూ.8 లక్షలు చెల్లించకుండా తప్పించుకున్న నిందితులు

ఈ వ్యవహారంలో బాధితుడు చంద్ర విలాస్ 2022లో నిందితుల వద్ద ఒక్కొక్కటి రూ.2 లక్షల విలువ కలిగిన నాలుగు చిట్ గ్రూపుల్లో సభ్యుడిగా చేరారు. ఒక్కో చిట్‌కు నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ వచ్చారు. నాలుగు చిట్టీల గడువు 2026 ఆగస్టులో ముగియడంతో నిందితులు మొత్తం రూ.8 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే గడువు ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించకుండా నిందితులు తప్పించుకోవడంతో బాధితుడు వారిని నిలదీశారు. అయినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణలో మరికొందరు బాధితులు

బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా, ఇదే విధంగా చిట్టీల పేరుతో డబ్బులు చెల్లించి మరికొందరు కూడా మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 497/2026 కింద కేసు నమోదు చేశారు.

బీఎన్ఎస్ సెక్షన్లు 316, 318(4) రెడ్‌విత్ 3(5), తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-1999 సెక్షన్ 5, చిట్ ఫండ్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భార్య తర్వాత భర్త అరెస్ట్

ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి అలియాస్ రహంగ్‌డాలే వైశాలి (49)ను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా ఆమె భర్త రహంగ్‌డాలే నరేంద్ర (46)ను కూడా అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ విద్యానగర్ కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా ప్రజలు చిట్ ఫండ్స్, ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులు, సంస్థల మాటలు నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని, సంబంధిత సంస్థల చట్టబద్ధత, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని హెచ్చరించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇచ్చోడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. రమేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విష్ణు ప్రకాష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE