e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం

మూడేళ్లలో రూ.60 వేల కోట్ల హామీ ఏమైంది? కనీసం రూ.6 కోట్లు అయినా ఇచ్చారా?

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నలు

మన భారత్, హైదరాబాద్:

పాలమూరు జిల్లాకు ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లలో కనీసం రూ.6 కోట్లు అయినా కేటాయించిందా అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు మాత్రమే నిధులు తరలిస్తున్నారని విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు పాలమూరు జిల్లాకు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

పాలమూరు జిల్లాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని పేర్కొన్నారు. కృష్ణా నది నుంచి కనీసం 30 టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోసుకోలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిని తరలించుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పాలమూరు జిల్లా పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కేవలం 300 మీటర్ల మేర మరమ్మతులు చేపడితే 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ పనులను కూడా ప్రభుత్వం చేపట్టలేదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాల ప్రజలకు సైతం ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే పరిస్థితులు మారిపోయాయని, మళ్లీ జిల్లా ప్రజలు వలస బాట పట్టే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కొత్త అభివృద్ధి పనైనా చేపట్టారా అని ప్రశ్నించారు.

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం మాత్రమే సరిపోదని, పీఆర్సీ, డీఏ అమలు చేస్తామని ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని అన్నారు. ఆ హామీలను నమ్మి ఉద్యోగులు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ అప్పులు చేశారని కాంగ్రెస్ నాయకులు పదేపదే విమర్శిస్తున్నారని, అయితే ఆ నిధులతోనే ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రహదారులు, అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కనపెట్టి ప్రతిసారీ కేసీఆర్‌ను విమర్శించడం ప్రజలు అంగీకరించరని అన్నారు.

రైతుల ఆత్మహత్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలకు మారుపేరుగా మారిందని విమర్శించారు. పాలమూరు జిల్లా పచ్చదనంతో కళకళలాడాలన్నా, రైతులకు మేలు జరగాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE