e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ప్రజలకు మెరుగైన సేవలే ఏఐ విజయానికి కొలమానం

ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వేగం పెంచాలి.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి

‘ఏఐ సాక్షమ్‌’ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి:

ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల జాప్యాన్ని తగ్గించి, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో కనిపించే సానుకూల మార్పే ఏఐ విజయానికి అసలైన కొలమానమని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్‌ నిర్వహించిన ‘ఏఐ సాక్షమ్‌’ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, ప్రజలకు అందించే సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలని వివరించారు.

ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగాలి

రైతులు, పింఛనుదారులు, సామాన్య ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సిన పరిస్థితులు మారాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దరఖాస్తుల పరిశీలన, సమాచారం సేకరణ, నివేదికల తయారీ వంటి పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఏఐ వినియోగంతో ఉద్యోగులకు ఆదా అయ్యే సమయాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సూచించారు.

ప్రభుత్వ శాఖల్లో పనుల నిర్వహణ మెరుగుపడటంతోపాటు సేవల నాణ్యత పెరగాలని, ప్రజలకు సులభంగా సమాచారం అందుబాటులో ఉండాలని చెప్పారు. ఏఐ కేవలం సాంకేతిక సాధనంగా మిగిలిపోకుండా, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించే విధంగా దాని వినియోగం ఉండాలని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల అమలుపై విశ్లేషణ

ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిర్దేశించిన లక్ష్యాలకు చేరుతున్నాయా? అభివృద్ధి ప్రాజెక్టుల్లో జాప్యాలకు కారణాలేమిటి? అమలులో ఎక్కడ లోపాలు ఉన్నాయి? వంటి అంశాలను విశ్లేషించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. వ్యయాల్లో అసాధారణ మార్పులను గుర్తించడం ద్వారా అధికారులు సమస్యలను ముందుగానే పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు.

అభివృద్ధి సూచికలు మెరుగ్గా ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో అందకపోవచ్చని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులందరికీ చేరుతున్నాయా? ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి? అనే అంశాలను ఏఐ విశ్లేషణ ద్వారా గుర్తించవచ్చని వివరించారు. అయితే సాంకేతిక వ్యవస్థలు గుర్తించిన అంశాలను మాత్రమే ఆధారంగా చేసుకుని తుది నిర్ణయాలు తీసుకోరాదని, క్షేత్రస్థాయి పరిశీలన, ఆధారాలు, నిబంధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

విద్యుత్‌ నిర్వహణలోనూ సాంకేతికత

విద్యుత్‌ రంగంలో డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, పరికరాల్లో తలెత్తే లోపాలను గుర్తించడం, నిర్వహణను మెరుగుపరచడంలో ఏఐ దోహదపడుతుందని భట్టి విక్రమార్క అన్నారు. రైతులు, చిన్న పరిశ్రమలు, ఆసుపత్రులకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అయితే వ్యవస్థలను అమలు చేయడానికి ముందు వాటి పనితీరు, భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

సమాచార భద్రతకు ప్రాధాన్యం

ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తర్వులను గుర్తించడం, నివేదికలు రూపొందించడం, ప్రజలకు అర్థమయ్యే భాషలో సమాచారం అందించడం వంటి పనులకు ఏఐ సాధనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అదే సమయంలో వ్యక్తిగత, అధికారిక సమాచారాన్ని అనుమతి లేని ఏఐ వ్యవస్థల్లో నమోదు చేయరాదని హెచ్చరించారు. ఏఐ రూపొందించిన సమాచారంలోని పేర్లు, మొత్తాలు, అర్హతలు, సాంకేతిక వివరాలను అధికారులు తప్పనిసరిగా ధ్రువీకరించాలని చెప్పారు.

ఏఐ ఆధారంగా తీసుకునే నిర్ణయాల్లో మానవ పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు ప్రతికూలంగా ప్రభావం చూపే నిర్ణయాలపై బాధ్యతాయుతమైన అధికారులను సంప్రదించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. తొలుత పరిమిత స్థాయిలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, కచ్చితత్వం, ఖర్చు, పనితీరు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను అంచనా వేసిన తర్వాతే విస్తరించాలని సూచించారు. తప్పులు తలెత్తినప్పుడు బాధ్యత వహించే అధికారి ఎవరో స్పష్టంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌, టీజీ మ్యాథ్‌ ఎండీ పూజ, ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE