సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం..
స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన: సీఐటీయూ
మల్కాజ్‌గిరి మన భారత్, జూలై 25: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండలం రాంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలై 25 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంపల్లి పారిశ్రామిక ప్రాంతం గత 25 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో భారీ వాహనాల రాకపోకల కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారాయని తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి ప్రయాణికులు, కార్మికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పారిశ్రామిక ప్రాంతంలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు, ఓపెన్ డ్రైనేజీలను మూసివేసి పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో తగినన్ని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కోరారు.
మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మున్సిపల్ అధికారులు ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి రాంపల్లి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని బంగారు నర్సింగరావు కోరారు. సంతకాల సేకరణ కార్యక్రమం అనంతరం కూడా అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో కీసర మండల నాయకులు చింతకింది అశోక్‌తో పాటు 70 మందికి పైగా కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి..
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
