మన భారత్ | ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వంలో 12,256 ఉద్యోగాలు.. ఈ నెల 22 వరకు దరఖాస్తులకు అవకాశం
SSC CGL-2026 నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL)-2026 నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12,256 గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 22, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కొన్ని పోస్టులకు స్టాటిస్టిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్ అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. (Govt Job)
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT టియర్-1, టియర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర దశలు ఉంటాయి. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. టియర్-1 పరీక్షలు ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో, టియర్-2 పరీక్షలు డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు వేతనం లభించనుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర కీలక పోస్టులు ఈ నియామకాల్లో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అధికారిక వెబ్‌సైట్: SSC Official Website
– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.
📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
