e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఒక్క నీటి చుక్కనూ వదలం: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది – మంత్రి ఉత్తమ్

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.

కృష్ణా జలాల విషయంలో గొప్పగా చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటోందని విమర్శించిన మంత్రి, వారి పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలుగా నీటి వాటాలపై సంతకాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణకు కేవలం 34 శాతం నీళ్లు సరిపోతాయని కేసీఆర్, హరీష్ రావులు అంగీకరించారని విమర్శించారు. 299 టీఎంసీలకు ఒప్పుకోవడం ద్వారా తెలంగాణకు మరణశాసనం రాసినట్లయ్యిందని మంత్రి మండిపడ్డారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ పేరుతో రూ.1.80 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారని వెల్లడించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు రూ.41 వేల కోట్లు, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క టీఎంసీ నీటిని కూడా అదనంగా సమకూర్చలేకపోయారని విమర్శించారు. అదే సమయంలో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని తగ్గించారని ఆరోపించారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.83 వేల కోట్లకు పైగా ఖర్చవుతోందని, మూడేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు కేవలం 35 శాతం పనులే జరిగాయని మంత్రి తెలిపారు. మట్టి, కాంక్రీట్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. “కుర్చీ వేసుకుని కూర్చుంటా” అని కేసీఆర్ అన్నారని, ఆ కుర్చీ ఎక్కడ పోయిందో, కేసీఆర్ ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 783 టీఎంసీలు కేటాయించాలని ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోందని మంత్రి తెలిపారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 73 శాతం భూభాగం తెలంగాణలోనే ఉందని పేర్కొన్నారు. మొత్తం 814 టీఎంసీల కృష్ణా నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 71–72 శాతం వరకు నీటి వాటా రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరలో వెలువడనుందని, తెలంగాణకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ చర్చలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొని మాట్లాడుతూ, నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఈ కీలక అంశంపై విస్తృత చర్చ కోసమే అసెంబ్లీలో లఘు చర్చ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత గల అంశంపై బీఆర్ఎస్ సభ్యులు సభకు హాజరుకాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నదీ జలాల అంశంపై ప్రజలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE