e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

మన పాఠశాల.. మన బాధ్యత: ఎంప్లాయీస్ అసోసియేషన్

మన పాఠశాల.. మన బాధ్యత: ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుల పిలుపు

తలమడుగు, మన భారత్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భోజ రెడ్డి, ట్రెజరర్ అశోక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖోడద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భారత రాజ్యాంగ గొప్పతనం, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలు వంటి అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలను వ్యాసాల రూపంలో వ్యక్తం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అనంతరం బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా భోజరెడ్డి, అశోక్ మాట్లాడుతూ.. పాఠశాల అనేది కేవలం చదువు నేర్పించే కేంద్రం మాత్రమే కాదని, విద్యార్థుల జీవితాలకు పునాది వేసే విజ్ఞాన మందిరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ‘మన పాఠశాల.. మన బాధ్యత’ అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, పాఠశాల అభివృద్ధిని తమ సొంత బాధ్యతగా భావించినప్పుడే ఆశించిన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.

గత ఏడాది పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తాము అందించినట్లు గుర్తుచేశారు. ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకుండా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది కూడా పది విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన ఫీజును అందించారు.

ప్రస్తుత కాలంలో పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర విజ్ఞాన సంబంధిత పుస్తకాలను చదవడం కూడా ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు పాఠశాల, గ్రామంలోని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, రోజూ కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించాలని కోరారు. పుస్తక పఠనం వల్ల భాషా పరిజ్ఞానం, ఆలోచనా శక్తి, సమాజంపై అవగాహన పెరుగుతాయని వివరించారు. మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని విద్యార్థులకు సూచించారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్పృహ, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవ్, ఉపాధ్యాయులు రమేష్, సందీప్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆదిలాబాద్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE