e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

మంత్రతంత్రాల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

మంత్రతంత్రాల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

ఐదుగురు నిందితుల అరెస్టు.. రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లాలో 8 కేసులు.. రాష్ట్రవ్యాప్తంగా 24 మంది బాధితులు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 23,

మంత్రతంత్రాలు, పూజల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. డబ్బులను పూజల ద్వారా రెండింతలు, నాలుగు రెట్లు చేస్తామని ఆశ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు నిందితులను ఇచ్చోడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,74,000 నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఎనిమిది కేసులు నమోదుకాగా, రాష్ట్రవ్యాప్తంగా 24 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు.

రూ.3 లక్షలతో వెళ్లిన బాధితులు.. బలవంతంగా నగదు లాక్కొని దాడి

ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44 సమీపంలో టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ నెల 19వ తేదీన ఈ మోసం జరిగినట్లు ఎస్పీ తెలిపారు.

ఫిర్యాదుదారుడు తోకల రాజు తన పరిచయస్తుడు శ్రీపతి శంకర్‌తో కలిసి వారం రోజుల క్రితం పని నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చారు. ఈ సమయంలో ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద నిందితులైన మండలి బక్కన్న, ఆత్రం పరశురాం, నౌగాడే శేఖర్, మండలి శైలేష్ పరిచయమయ్యారు. తమకు మంత్రతంత్రాలు తెలుసునని, ఒక రూపాయి నోటును పూజల ద్వారా పది రూపాయలుగా మార్చగలమని నమ్మించారు. ఈ క్రమంలో శ్రీపతి శంకర్ ఫోన్ నంబర్ తీసుకున్నారు.

ఈ నెల 19న బక్కన్న ఫోన్ చేసి తమ వద్దకు వస్తున్నామని, ఎంత డబ్బు ఉన్నా తీసుకురావాలని సూచించాడు. అనంతరం ఇచ్చోడకు చేరుకున్నామని, ఎన్‌హెచ్‌-44 పక్కన టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి దగ్గరకు రావాలని తెలిపారు.

డబ్బులు రెట్టింపు అవుతాయనే ఆశతో తోకల రాజు, శ్రీపతి శంకర్ కలిసి రూ.3 లక్షల నగదుతో అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న బక్కన్న, శేఖర్ డబ్బులు చూపించాలని కోరారు. బాధితులు నగదు చూపిస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి బలవంతంగా రూ.3 లక్షలు లాక్కొని వారిపై దాడి చేశారు. అనంతరం మిగతా నిందితులతో కలిసి కారులో అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు పారిపోతున్న సమయంలో బాధితుడు ఒక నిందితుడి ఫొటోను తన మొబైల్‌లో చిత్రీకరించాడు.

మరుసటి రోజు బాధితులు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెల్లకాగితాలు, బొమ్మ నోట్లతో మోసాలకు పాల్పడిన ముఠా

ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆత్రం పరశురాం గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు మంత్రశక్తులు ఉన్నాయని, పూజల ద్వారా బాధితులు ఇచ్చిన డబ్బులను రెండు రెట్లు లేదా నాలుగు రెట్లు చేసి తిరిగి ఇస్తానని ప్రజలను నమ్మించేవాడు.

ఈ క్రమంలో మండలి బక్కన్నతో పరిచయం ఏర్పడగా, ఇద్దరూ కలిసి పథకం ప్రకారం మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అనంతరం బక్కన్న బంధువులైన నౌగాడే శేఖర్, మండలి శైలేష్‌లను కూడా ముఠాలో చేర్చుకున్నారు.

ప్రజలకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపించి వారి నుంచి నగదు వసూలు చేసేవారు. పూజల పేరుతో బాధితులు తీసుకొచ్చిన నగదు బ్యాగులను తెల్లకాగితాలు లేదా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ నోట్లతో నింపిన బ్యాగులతో మార్చేవారు. అనంతరం ఐదు నుంచి పది రోజుల వరకు బ్యాగులను తెరవకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.

బాధితులు తిరిగి డబ్బుల గురించి అడిగితే పూజలు సరిగా జరగలేదని, మరోసారి పూజలు చేయాలని, ఇందుకోసం మరింత డబ్బు తీసుకురావాలని చెప్పి మళ్లీ మోసాలకు పాల్పడేవారు. ఇలా పలువురిని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కారు కొనుగోలు, ఇంటి నిర్మాణానికి మోసాల సొమ్ము

మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోనూ ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులను నలుగురు సభ్యులు సమానంగా పంచుకునేవారని, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలు, కారు ఈఎంఐలు, ఇంటి నిర్మాణం తదితరాలకు వినియోగించినట్లు ప్రధాన నిందితుడు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.

ఐదుగురు నిందితుల వివరాలు

1. ఆత్రం పరశురాం (40) – గిన్నెర గ్రామం, ఇంద్రవెల్లి మండలం.
2. మండలి బక్కన్న (47) – శాంతినగర్ కాలనీ, ఇంద్రవెల్లి.
3. నౌగాడే శేఖర్ (39) – అర్జుగూడ కాలనీ, వాంకిడి మండలం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.
4. మండలి శైలేష్ (27) – బస్టాండ్ ప్రాంతం, కెరమెరి మండలం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.
5. షేక్ అలీం (36) – బజార్ మేలా కాలనీ, సిర్పూర్ (యు) మండలం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.

జిల్లాలో ఎనిమిది కేసులు.. 10 మంది బాధితులు

నిందితులపై ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మొత్తం ఎనిమిది కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు (క్రైమ్ నంబర్లు 331, 333), ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు (క్రైమ్ నంబర్లు 212, 213, 215, 216, 217), ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి.

ఈ కేసులకు సంబంధించి జిల్లాలో మొత్తం 10 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామని, రాష్ట్రవ్యాప్తంగా ఈ ముఠా చేతిలో 24 మంది మోసపోయినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బులను కోల్పోవద్దన్నారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ఈ కేసు దర్యాప్తులో ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్సై ఎల్. శ్రీకాంత్, ఇచ్చోడ ఎస్సై కె. విష్ణు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై విష్ణు ప్రకాష్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE