e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ వ్యవహారాలపై విచారణ జరిపించాలి: కింది శ్రీనివాస్ రెడ్డి

ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ వ్యవహారాలపై విచారణ జరిపించాలి

ఎల్ఐసీ లేఅవుట్‌లో 11 ప్లాట్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తాం

ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం సరికాదు.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి: కంది శ్రీనివాస రెడ్డి

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సంబంధించిన భూ వ్యవహారాలు, ఎల్ఐసీ లేఅవుట్‌లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన భూ వ్యవహారాలపై త్వరలోనే పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై పలు ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ఐసీ లేఅవుట్‌లో ఎమ్మెల్యే తన భార్యకు బహుమతిగా 11 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తేలితే సంబంధిత ప్లాట్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేయించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సెటిల్మెంట్లు, భూకబ్జాలు, బెదిరింపులు, భూ లావాదేవీలు, వసూళ్ల అంశాలపై ఆధారాలను సేకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండే వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కంది సూచించారు. గతంలో జరిగిన కొన్ని వ్యాపార లావాదేవీలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేను నమ్ముకుంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక కారిడార్ భూముల విషయంలోనూ కొందరు బినామీలు, బంధువుల పేర్లతో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలోనూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనవసరంగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విమానాశ్రయానికి సంబంధించిన చరిత్ర నిజాం కాలం నుంచే ఉందని, అందుబాటులో ఉన్న అనుకూల పరిస్థితుల కారణంగానే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం మంజూరైందని పేర్కొన్నారు. ఇందులో వ్యక్తిగతంగా ఎవరికీ ప్రత్యేక ఘనత ఆపాదించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై రాజకీయ ప్రచారం వద్దు

ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తానే ఇళ్లు మంజూరు చేయిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రావడం లేదని వ్యాఖ్యానించారు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

ఆదిలాబాద్ నియోజకవర్గానికి కొత్తగా 5,226 చేయూత పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

ఈ మీడియా సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, జైనథ్ ఏఎంసీ చైర్మన్ అశోక్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, మంచికట్ల ఆశమ్మ, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, బూర్ల శంకరయ్య, షాహిద్ అలీ, ఫైజుల్లా ఖాన్, రఫీఖ్, షకీల్, దర్శనాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE