e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం కల్పించాలి..

డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు ఆశా వర్కర్ల హెచ్చరిక

నారాయణపేట, నవంబర్ 10: ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే 2026 డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పీఏ మాధవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు బాలమణి, కార్యదర్శి అనురాధ, సీఐటీయూ జిల్లా నాయకులు నరహరి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక సేవలందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు వెయ్యి మంది, పట్టణ ప్రాంతాల్లో 2 వేల నుంచి 5 వేల మంది ప్రజలకు ఆశా కార్యకర్తలు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

గర్భిణులను ఆసుపత్రుల్లో ప్రసవించేలా ప్రోత్సహించడం, తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ఆశాలు కీలకంగా పనిచేస్తున్నారని వివరించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆశా కార్యకర్తల సేవలను గుర్తించి గ్లోబల్ లీడర్లుగా ప్రకటించిందని తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సబ్‌సెంటర్లలో విధులు నిర్వహించడంతో పాటు ఏఎన్‌సీ, పీఎన్‌సీ, వివిధ ఆరోగ్య సర్వేలు, ఎన్‌సీడీ ఆన్‌లైన్ నమోదు, స్పుటమ్ డబ్బాల తరలింపు, డ్రై డే, ఫ్రైడే, లెప్రసీ, పల్స్ పోలియో వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఆశాలకు ఇప్పటికీ స్థిర వేతనం లేదని, నెలకు కేవలం రూ.9,900 పారితోషికం మాత్రమే అందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా పారితోషికాలు పెరగకపోవడంతో పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.

2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఆశా కార్యకర్తలు 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించారని గుర్తుచేశారు. ఆ సమయంలో అధికారులు సమస్యల పరిష్కారానికి ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొందని చెప్పారు. పలుమార్లు జరిగిన చర్చల్లో రూ.50 లక్షల బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, సెలవులు, ప్రమోషన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్ 22(1) ప్రకారం సమ్మె నోటీసు అందజేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు.

ప్రధాన డిమాండ్లు: ఆశాలకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రూ.50 లక్షల జీవిత బీమా, రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు అమలు చేయాలని, పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షలు చెల్లించి పారితోషికంలో సగం పెన్షన్‌గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులతో పాటు ఏడాదికి 20 రోజుల క్యాజువల్ లీవ్, ఆరు నెలల వేతనంతో కూడిన వైద్య సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకు ప్రమోషన్లు కల్పించాలని, రెండో పీఆర్సీలో రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశాలకూ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఆశా కార్యకర్తలకు వర్తింపజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు శ్రీదేవి, నిర్మల, ఉమ, భాగ్యమ్మ, పార్వతమ్మ, బాలనర్సమ్మ, మహేశ్వరి, కృష్ణవేణి, శాంతి, మంగమ్మ, నర్సమ్మ, యాదమ్మ, సుజాత, చంద్రకళ, సుమిత్ర, లక్ష్మి, నీలమ్మ, కవిత, వెంకటేశ్వరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద మండలాల నుంచి 50 మందికి పైగా ఆశా కార్యకర్తలు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE