e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

యూరప్‌లో డ్రైవర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా.. రూ.1.32 లక్షలు స్వాహా

యూరప్‌లో డ్రైవర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా.. రూ.1.32 లక్షలు స్వాహా

విదేశాల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం
ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద నకిలీ ఏజెంట్ అరెస్ట్
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు: రూరల్ సీఐ రహీం పాషా

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 05: విదేశాల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. యూరప్‌లో డ్రైవర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ నిరుద్యోగి కుటుంబం నుంచి రూ.1.32 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితుడిని తలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ రహీం పాషా వెల్లడించారు.

వాట్సాప్ కాల్‌తో పరిచయం.. ఉద్యోగం పేరుతో వల

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన ఎల్చల పోచన్న (20) జీవనోపాధి కోసం 2023లో సౌదీ అరేబియాకు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లడి గ్రామానికి చెందిన మాలోత్ మహేష్ (34) వాట్సాప్ కాల్ ద్వారా పోచన్నను సంప్రదించాడు. తాను యూరప్‌లో ఉంటున్నానని, అక్కడ క్యాసినో హోటళ్లలో డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అధిక జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.

నిందితుడి మాటలు నమ్మిన పోచన్న ఈ విషయాన్ని తన తల్లి ఎల్చల అమ్మక్కకు తెలియజేశాడు. దీంతో ఆమె 2025 అక్టోబర్ 22న నిందితుడి బ్యాంకు ఖాతాకు రూ.1,20,000 బదిలీ చేసింది. అనంతరం వీసా ప్రక్రియ కోసం మరింత డబ్బు అవసరమని చెప్పడంతో మరో రూ.12,000 చెల్లించారు. ఇలా మొత్తం రూ.1,32,000 నిందితుడికి అందజేశారు.

డబ్బులు తీసుకొని ఉద్యోగం, వీసా విషయంలో నిర్లక్ష్యం

డబ్బులు అందుకున్న అనంతరం ఉద్యోగం, వీసా ప్రక్రియను పూర్తి చేస్తానని చెప్పిన నిందితుడు రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధిత కుటుంబ సభ్యులు పలుమార్లు ప్రశ్నించగా, వాయిదాలు వేస్తూ చివరకు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు.. బస్టాండ్ వద్ద నిందితుడి అరెస్ట్

బాధితురాలి ఫిర్యాదు మేరకు తలమడుగు పోలీస్ స్టేషన్‌లో Cr.No.208/2026 కింద BNS సెక్షన్లు 318(4), 316(5), అలాగే Emigration Act సెక్షన్ 24(1)(b) r/w 10 ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారం అందడంతో నవంబర్ 05న ఆదిలాబాద్ బస్టాండ్ ప్రాంతంలో నిందితుడు మాలోత్ మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మోసానికి ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి వివరాలు:

మాలోత్ మహేష్ (34), తండ్రి చందు, కల్లడి గ్రామం, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా.

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు: పోలీసులు

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల మాటలను గుడ్డిగా నమ్మవద్దని రూరల్ సీఐ రహీం పాషా సూచించారు. విదేశీ ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించే ముందు సంబంధిత రిక్రూటింగ్ ఏజెన్సీకి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా, ఏజెంట్ గుర్తింపు, ఉద్యోగ ఒప్పందం, వీసా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తులకు ముందస్తుగా డబ్బులు చెల్లించి మోసపోవద్దని, ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కేసు దర్యాప్తు, నిందితుడి అరెస్టు కార్యక్రమంలో తలమడుగు ఎస్ఐ డి. రాధికతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE