e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

సామాజిక భద్రతా పింఛన్లలో ఇన్‌స్టంట్ విధానం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటు పలు కేటగిరీలకు విస్తరణ – పింఛన్‌దారుడైన భర్త మరణిస్తే భార్యకు తక్షణమే పింఛన్ – మంత్రి సీతక్క చొరవతో మార్గదర్శకాలు జారీ

మన భారత్, హైదరాబాద్‌:

సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ పెద్దగా ఉన్న పింఛన్‌దారుడైన భర్త మరణించినప్పుడు ఆ కుటుంబానికి అందుతున్న ఆర్థిక సహాయం నిలిచిపోకుండా, అర్హత కలిగిన భార్యకు వెంటనే సామాజిక భద్రతా పింఛన్‌ మంజూరు చేసే ఇన్‌స్టంట్ పెన్షన్‌ విధానాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్‌దారుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని తాజాగా మరికొన్ని పింఛన్‌ కేటగిరీలకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, హెచ్‌ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితులకు సంబంధించిన పింఛన్‌ కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. పింఛన్‌ పొందుతున్న వ్యక్తి మరణించిన అనంతరం కుటుంబ సభ్యులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అర్హతను పరిశీలించి వీలైనంత త్వరగా పింఛన్‌ మంజూరు చేయడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

వయస్సు ఆధారంగా పింఛన్‌ కేటాయింపు

పింఛన్‌ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆయన భార్య వయస్సును పరిగణనలోకి తీసుకొని పింఛన్‌ కేటగిరీని నిర్ణయించనున్నారు. భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛన్‌ మంజూరు చేస్తారు. 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే వృద్ధాప్య పింఛన్‌ కింద ఆర్థిక సహాయం అందించనున్నారు. దీనివల్ల భర్త మరణంతో కుటుంబానికి అందుతున్న సామాజిక భద్రతా సహాయం ఒక్కసారిగా నిలిచిపోకుండా కొనసాగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

ఈ పింఛన్‌ సదుపాయం పొందాలనుకునే అర్హులైన మహిళలు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్‌ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు భార్య ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ, మరణించిన పింఛన్‌దారుడి ఆధార్‌ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.

దరఖాస్తు అందిన తర్వాత సంబంధిత అధికారులు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తారు. వివరాలను చెయూత పోర్టల్‌లో నమోదు చేసి, అర్హతను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం పింఛన్‌ మంజూరుకు చర్యలు తీసుకుంటారు.

మహిళలకు ఆర్థిక భరోసా

భర్తను కోల్పోయిన మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహించే క్రమంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పింఛన్‌పై ఆధారపడి జీవించే కుటుంబాల్లో భర్త మరణం తర్వాత ఆదాయ మార్గం నిలిచిపోవడంతో సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇన్‌స్టంట్ పెన్షన్‌ విధానాన్ని విస్తరించింది.

సామాజిక భద్రతా పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, నిరుపేద కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కేటగిరీలకు ఇన్‌స్టంట్ పెన్షన్‌ సదుపాయం కల్పించడం ద్వారా భర్తను కోల్పోయిన అర్హులైన మహిళలకు తక్షణ ఊరట లభించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం సామాజిక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యగా భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE