e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

రైతు గర్జన సభతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు!

రైతు గర్జన సభతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు!

నవంబర్ 1న ఆదిలాబాద్ డైట్ మైదానంలో భారీ బహిరంగ సభ

సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్

సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 31, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల ఆవేదనను వినిపించే లక్ష్యంతో నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్ డైట్ మైదానానికి చేరుకుని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక ఏర్పాటు, ప్రజలు కూర్చునే ప్రాంతం, వాహనాల పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలపై నాయకులు వివరాలు తెలుసుకున్నారు. సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ రైతు దేశానికి అన్నం పెట్టే అన్నదాత అని, రైతును కేవలం ఓటు వేసే వ్యక్తిగా కాకుండా సమాజానికి వెన్నెముకగా గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని జోగు రామన్న అన్నారు. రైతుల సమస్యలపై నిర్వహిస్తున్న ఈ సభకు గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజల మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందని గుర్తుచేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా పథకాలను కొనసాగించామని పేర్కొన్నారు.

రెండు నెలల ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులు, పంటల నష్టాలు, వ్యవసాయ పెట్టుబడుల భారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలకు ప్రభుత్వం తగిన పరిష్కారాలు చూపాలని డిమాండ్ చేశారు.

రానున్న రోజుల్లో రైతులు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జోగు రామన్న అన్నారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కుటుంబాల నుంచి రాజకీయంగా గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నవంబర్ 1న నిర్వహించే రైతు గర్జన సభ రైతుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వేదికగా నిలవాలని, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, యాసం నర్సింగరావు, జోగు మహేందర్, కేమా శ్రీకాంత్, మార్శెట్టి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE