e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఇంద్రవెల్లి నుంచే తెలంగాణ రక్షణ సేన పోరాట శంఖారావం

పాంచజన్య సంకల్ప సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. ఆదివాసీలు, రైతులు, యువత సమస్యలే ప్రధాన ఎజెండా

రైతులను పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండేందుకు అర్హుడా?

ఆదిలాబాద్ అభివృద్ధిపై పాలకులను నిలదీస్తాం.. ప్రజల గొంతుకగా పోరాడతాం: కల్వకుంట్ల కవిత

మన భారత్, ఇంద్రవెల్లి:

ఆదివాసీ పోరాటాల చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఇంద్రవెల్లి గడ్డపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల హక్కులు, రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితర అంశాలపై తన వైఖరిని వెల్లడించారు.

సభలో కవిత మాట్లాడుతూ.. విప్లవానికే వన్నె తెచ్చిన ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. స్వాతంత్ర్యం, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన రామ్‌జీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము తదితర మహనీయులను స్మరించుకున్నారు. జల్, జమీన్, జంగల్ నినాదంతో పోరాడిన కొమురం భీమ్‌తో పాటు శిడెం శింబు, కొమురం సూరు వంటి పోరాట యోధులకు నివాళులర్పించారు.

ఇంద్రవెల్లి కాల్పుల ఘటనను ప్రస్తావిస్తూ, అప్పట్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం సమావేశం కావాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాల్పులు జరిగాయని విమర్శించారు. ఆదివాసీలను కాల్చి చంపిన ఘటనకు సంబంధించిన బాధను ఇక్కడి అమరవీరుల స్థూపం గుర్తు చేస్తోందన్నారు. ఇంద్రవెల్లి అమరవీరులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన హామీని విస్మరించారని ఆరోపించారు.

ఆదిలాబాద్ అభివృద్ధిలో తీవ్ర వెనుకబాటు

ప్రకృతి సంపద, అడవులు, గోదావరి, ప్రాణహిత నదులు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ పేదరికం కొనసాగడం బాధాకరమని కవిత అన్నారు. సుమారు 750 గ్రామాల్లో కనీసం పాఠశాలలు లేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.11 లక్షల వరకు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.2 లక్షలు కూడా లేదని, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో భారీ వ్యత్యాసం ఉందని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే వచ్చారని ఆరోపించారు. జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రశ్నించేందుకు, వారి తరఫున పోరాడేందుకు తెలంగాణ రక్షణ సేన కొత్త రాజకీయ శక్తిగా ముందుకొచ్చిందని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ పనులపై కవిత ప్రభుత్వాలను నిలదీశారు. కాగజ్‌నగర్ ప్రాంతంలో లక్షా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కేవలం ఆరు వేల ఎకరాలకే నీరు అందుతోందని ఆరోపించారు. కేపీ రావు, జగన్నాథ ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని 12 ఏళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ అంశంగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. ముందుగా ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతులకు నీరు, విద్యుత్, యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. కరువు పరిస్థితులు వస్తాయని ముందుగానే తెలిసినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతులను పంటలు వేయవద్దని సూచించిన ముఖ్యమంత్రి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక భరోసా ఎలా కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులను సాగుకు దూరంగా ఉండాలని చెప్పే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలా? అని వ్యాఖ్యానించారు.

పాంచజన్యం పేరుతో ఐదు ప్రధాన హామీలు

తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం పేరుతో ఐదు కీలక అంశాలకు ప్రాధాన్యతనిస్తోందని కవిత ప్రకటించారు. విద్య, వైద్యం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలపై తమ కార్యాచరణ ఉంటుందని వివరించారు.

ప్రైవేటు రంగంలోనూ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కుటుంబాలు తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

యువత తమ అభిరుచులు, ఆలోచనలకు అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఆదివాసీల హక్కులు, రిమ్స్ సమస్యలపై ఆందోళన

ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో జీవో 57తో పాటు గతంలో అమల్లో ఉన్న 27 జీవోలను తిరిగి అమలు చేయాలని కోరారు. 1972లో ఆస్తులు కొనుగోలు చేసుకున్న ఆదివాసీలకు న్యాయం జరగాలని అన్నారు.

ఆదివాసీ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నప్పటికీ వారికి అందించాల్సిన పోషకాహార కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. రిమ్స్‌లో చిన్నారుల మరణాల ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు

ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యాసంస్థల అభివృద్ధిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలను కవిత ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్‌కు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పదేళ్ల పాలనలో జిల్లాకు ఒక్క విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.

సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాలను ప్రస్తావించారు. సీసీఐని కాపాడటంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

చనాఖా-కొరాటా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.368 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు పెరిగిందని పేర్కొంటూ, ఇంత భారీగా వ్యయం పెరగడానికి కారణాలేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సంబంధిత నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న పేర్లను ప్రస్తావిస్తూ ప్రాజెక్టు వ్యయంపై విచారణ జరగాలని వ్యాఖ్యానించారు.

జిల్లాలో పత్తి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయకపోవడంపై అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉన్నా రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత.. సామాజిక న్యాయానికి కట్టుబాటు

సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనే ఉద్దేశంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించినట్లు కవిత తెలిపారు. రాజకీయ నేపథ్యం, ఆర్థిక బలం లేని శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ వంటి విద్యావంతులైన యువకులకు అవకాశం కల్పించామని చెప్పారు. ఇలాంటి వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణలో హిందూ, ముస్లింలు పరస్పర సామరస్యంతో జీవించాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం కోరిన కవిత

జిల్లా ప్రజలు, ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదం కోసం ఇంద్రవెల్లికి వచ్చానని కవిత అన్నారు. నాగోబా తల్లి ఆశీస్సులతో తమ పార్టీ తొలి జెండా ఈ ప్రాంతం నుంచే ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ పోరాడుతామని స్పష్టం చేశారు.

రైతులు, ఆదివాసీలు, నిరుద్యోగ యువత, పేద ప్రజల సమస్యలను తమ ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు సాగుతామని తెలిపారు. రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇంద్రవెల్లి పాంచజన్య సంకల్ప సభలో కవిత చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వాలపై సంధించిన ప్రశ్నలు, ఆదివాసీ హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, సామాజిక న్యాయంపై చేసిన ప్రకటనలు సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE