e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

వరి సాగుకు దూరంగా ఉండాలి.. మొక్కజొన్న, శనగ, పెసర వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

 

రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

ప్రకృతి విపత్తుపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దు: ప్రభుత్వ విప్ విజయరమణారావు

మన భారత్, పెద్దపల్లి: రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుని వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎల్‌నినో ప్రభావం, రానున్న వ్యవసాయ సీజన్‌లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌తో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో వర్షాలు తగ్గి భూగర్భ జలమట్టాలు పడిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులు పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు.

గ్రామస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత, పంటల ఎంపికపై సమగ్ర అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.

రైతులకు సాగునీరు అందించేందుకు కృషి

జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో తాను, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలిసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదించి పెద్దపల్లి జిల్లా రైతులకు సాగునీరు అందించేలా కృషి చేశామని విజయరమణారావు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్నందున సాగునీటి లభ్యతపై సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. అందువల్ల రైతులు పరిస్థితులను అర్థం చేసుకుని వరి సాగు విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మొక్కజొన్న కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్ ద్వారా చర్యలు చేపట్టాలి

ఆరుతడి పంటల సాగుకు రైతులు ముందుకు వస్తే వాటికి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబును విజయరమణారావు కోరారు. రైతులకు పంటల మార్పిడిపై నమ్మకం కల్పించేందుకు కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.

ప్రకృతి విపత్తు పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మకుండా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరా విషయంలోనూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవద్దని సూచించారు. అవసరానికి మించి విద్యుత్ వినియోగించకుండా పొదుపుగా ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలో రైతులకు అండగా నిలవాలని విజయరమణారావు పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE