e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

నిరుపేద ఆదివాసీలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు

ముగ్గురికి తొలి విడతలో ఆపరేషన్లు.. మరో 13 మందికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 30:

మారుమూల గిరిజన గ్రామాల్లోని నిరుపేద ఆదివాసీ ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందుకొచ్చింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చొరవతో తొలి విడతలో ముగ్గురు గిరిజనులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు.

తాంసి మండలంలోని గిరిగామ గ్రామంలో ఈనెల 26న జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అంబుగాం, గిరిగామ, అత్నం గూడ, లింగు గూడ గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షించిన వైద్యులు మొత్తం 16 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు.

ఆర్థిక ఇబ్బందులతో పాటు రవాణా సౌకర్యాలు లేక కంటి వైద్యం చేయించుకోలేకపోతున్న ఆదివాసీల పరిస్థితిని గుర్తించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వారికి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా తీవ్ర కంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురిని తొలి విడతలో ఆదిలాబాద్ పట్టణంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించి, ఆసుపత్రి సహకారంతో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించారు.

శస్త్రచికిత్సలు పొందిన వారిలో అంబుగాం గ్రామానికి చెందిన దుర్వ బుజంగరావు (67), గిరిగామకు చెందిన పర్దాన్ రామారావు (62), తొడసం తులసిరామ్ (55) ఉన్నారు. వీరికి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు. గ్రామాల నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు, చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామాలకు చేరుకునేందుకు పోలీస్ శాఖ రవాణా సదుపాయం కల్పించింది.

మారుమూల గ్రామాల్లో నివసించే పేద గిరిజనులకు వైద్య సహాయం అందించడంలో పోలీస్ శాఖ చూపిన చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచి కంటి ఆపరేషన్లు చేయించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన 13 మందికి కూడా దశలవారీగా కంటి శస్త్రచికిత్సలు అందించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రేయ, డాక్టర్ సిమ్రాన్, డాక్టర్ అఫ్రిద్, డాక్టర్ అనిషా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టి. రంజిత్ కుమార్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ అత్రం తూర్పాబాయి, యశ్వంతరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE