e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలి

పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూడాలి

అధికారులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచన

మన భారత్, ఎల్బీనగర్:

అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో పేద చిరు వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధి ఎంత ముఖ్యమో, ఆ రహదారుల పక్కన చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదల జీవితాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ ఆర్చ్ నుంచి టీకేఆర్ కాలేజీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణ ప్రణాళికలో భాగంగా రహదారి పక్కన వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులకు చెందిన డబ్బాలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉదయం 6 గంటలకు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. డబ్బాలు తొలగించడంతో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు, ఆవేదనను తెలుసుకున్నారు.

పేదల సమస్యలపై ఎమ్మెల్యే స్పందన

ఈ సందర్భంగా బాధిత చిరు వ్యాపారులు తమ ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నందనవనం ప్రాంతంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, డబ్బాలు తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారికి అడ్డంగా ఉందని చెబుతున్న టీకేఆర్ ఆర్చ్‌ను తొలగించకుండా, తమలాంటి పేద చిరు వ్యాపారుల డబ్బాలను మాత్రమే తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, రాజకీయ అండదండలు ఉన్నవారికి మరో న్యాయమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బాధితుల సమస్యలను విన్న ఎమ్మెల్యే వారి జీవనోపాధికి సంబంధించిన అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రహదారి నిర్మాణం పేరుతో పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జోనల్ కమిషనర్‌తో ఎమ్మెల్యే చర్చలు

చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత వ్యాపారుల పరిస్థితిని వివరించి, కొన్ని రోజులపాటు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని కోరారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు లేదా తగిన ఏర్పాట్లు కల్పించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

చిరు వ్యాపారులు తమ కుటుంబాల జీవనోపాధి కోసం ఈ చిన్న వ్యాపారాలపైనే ఆధారపడి ఉన్నారని, వారికి తగిన అవకాశం కల్పించకుండా చర్యలు తీసుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి, వ్యాపారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్న తర్వాతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ముఖ్యం

రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నగర పురోగతికి అవసరమని, అదే సమయంలో వాటిపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి, వారికి నష్టం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, నాయకులు శ్రీనివాస్ నాయక్, కాప్ర నాయక్, గోపి మధు, నాగిరెడ్డి, బిక్షపతి, సాయి యాదవ్, మహేందర్, కృష్ణ, నరేష్, రెడ్డిమాల కృష్ణ, విష్ణు గౌడ్, అనిత, కింగ్ మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE