e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ

పెట్టుబడుల రక్షణ, పరిశ్రమల వృద్ధి నా బాధ్యత

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

మన భారత్, న్యూఢిల్లీ:

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడుల భద్రత, పరిశ్రమల అభివృద్ధి, అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం తన బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, అందుబాటులో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ సన్నాహక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ దేశాల దౌత్య ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పెట్టుబడులను రెట్టింపు చేయండి

పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలు తమ ప్రణాళికలను మరింత విస్తరించాలని కోరారు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న మొత్తాన్ని రెట్టింపు చేయడంతో పాటు, వృద్ధి లక్ష్యాలను కూడా పెంచుకోవాలని సూచించారు. ఆ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

వ్యాపార రంగంపై పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన అవగాహన ఉంటుందని, వారి అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను రూపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

‘వికసిత్ భారత్–2047’ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్–2047’ ప్రణాళికను రూపొందించినట్లు సీఎం తెలిపారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో రాష్ట్ర వాటా సుమారు ఐదు శాతంగా ఉందని పేర్కొంటూ, ఈ వాటాను పెంచేందుకు పరిశ్రమలు, సేవారంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు.

హైదరాబాద్‌కు హైస్పీడ్ రైలు అనుసంధానం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు, పుణె నగరాలతో అనుసంధానించే మూడు ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రస్తావన చేశారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల ప్రతిపాదనలు, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, నేవీ రాడార్ కేంద్రం వంటి అంశాలను కూడా వివరించారు.

హైదరాబాద్‌కు చారిత్రక వైభవంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీపడే స్థాయికి ఎదగాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

డిసెంబర్‌లో గ్లోబల్ సమ్మిట్

హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. తెలంగాణలోని పారిశ్రామిక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టికి ఈ సదస్సు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఐఐ తెలంగాణ చైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ప్రెసిడెంట్-డిజిగ్నేట్ సుచిత్ర కె. ఎల్లా ప్రసంగించారు. మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE