శాంతపూర్‌లో ఎస్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం
ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదివాసుల అభివృద్ధికి అండగా ఉంటాం
మన భారత్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలంలోని శాంతపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, దీపావళి నాటికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం వినాయక చవితి పర్వదినానికే కమ్యూనిటీ హాల్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, ఐక్యతతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. శాంతపూర్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిన్నచిన్న గోండు గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి, ‘మావ నాటే మావ రాజ్’ అనే నినాదానికి అనుగుణంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదివాసులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వారు అడగకముందే అవసరాలను గుర్తించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ఐక్యతను పెంపొందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నూతన కమ్యూనిటీ హాల్‌ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
