108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి..
వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్
మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 అంబులెన్స్ సేవల్లో పాముకాటు విరుగుడు (ఆంటీ స్నేక్ వెనం) ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు.
పాముకాటుకు ఉపయోగించే ఆంటీ స్నేక్ వెనం (ASV) ఇంజెక్షన్ సాధారణ మందు కాదని, దీనిని కేవలం వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొందరు రోగుల్లో తీవ్రమైన అలర్జీ, అనాఫైలాక్సిస్ వంటి ప్రమాదకరమైన రియాక్షన్లు వచ్చే అవకాశం ఉండటంతో, అత్యవసర వైద్య సదుపాయాలు ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తారని వివరించారు.
108 అంబులెన్స్‌ల ప్రధాన బాధ్యత అత్యవసర పరిస్థితుల్లో రోగికి ప్రాథమిక వైద్య సహాయం అందించి, సమీపంలోని సరైన వైద్యసదుపాయాలు ఉన్న ఆసుపత్రికి సురక్షితంగా తరలించడం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ అందుబాటులో ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
వర్షాకాలంలో పాముకాటు ఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాము కరిచిన వెంటనే స్థానిక వైద్యుల సలహాలు, అపోహలు లేదా ఇంటి వైద్యాలను ఆశ్రయించకుండా వెంటనే 108కు కాల్ చేసి సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పాముకాటు జరిగిన అవయవాన్ని ఎక్కువగా కదిలించకుండా ఉంచడం, బాధితుడిని ప్రశాంతంగా ఉంచడం వల్ల విషం శరీరమంతా వేగంగా వ్యాపించకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, అధికారిక వర్గాలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాల వల్ల ప్రజలు అపోహలకు గురై ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అత్యవసర వైద్య సేవల కోసం 108 సేవలను వినియోగించుకోవాలని, సరైన సమయంలో చికిత్స పొందితే పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని సామ్రాట్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
