e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

తెలంగాణకు ప్రధాని ఏమిచ్చారు..?

మన భారత్, హైదరాబాద్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి పర్యటన ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, నిధులు వస్తాయని ఆశించారని, కానీ ఆ ఆశలు నెరవేరలేదని వ్యాఖ్యానించారు.

ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవప్రదంగా స్వాగతం పలికామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. అయితే ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడాల్సిన ప్రధాని, “పెట్రోల్-డీజిల్ తక్కువ వాడండి, బంగారం కొనొద్దు, వంటనూనె వినియోగం తగ్గించండి” వంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని విమర్శించారు. దేశ ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రధానమంత్రి భయాందోళనలు సృష్టించేలా మాట్లాడటం బాధాకరమన్నారు.

దేశంలో మంచి పరిపాలన అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని ఆరోపించారు. ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లలో నిలబడిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై కూడా మంత్రి తీవ్రస్థాయిలో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నేతలు ఆరోపణలు చేసినా, వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణకు 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ టవర్ సర్కిల్, మెట్రో, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు వంటి అభివృద్ధి పనుల్లో కేంద్ర-రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధమా అని బీజేపీ నేతలను సవాల్ చేశారు. ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపుతోందని ఆరోపించారు.

పక్క రాష్ట్రాలు అడిగినన్ని నిధులు పొందుతున్నాయని, కానీ తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క వినతిపత్రం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి కావాల్సిన మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, కేంద్ర సంస్థలు, దేవాలయాల అభివృద్ధి, పుష్కర నిధులపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.

కులగణన అంశంపైనా మంత్రి స్పందించారు. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే దేశవ్యాప్తంగా కులగణనపై చర్చ మొదలైందన్నారు. తెలంగాణలో కులగణన చేపట్టామని, దేశ జనగణనలో బీసీల లెక్కలు కూడా నమోదు చేయాలని ప్రధానికి సూచించామని తెలిపారు. కానీ కేంద్రం బీసీ కుల గణనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ శ్రీరాముడిని రాజకీయాల కోసం వాడుకోదని, భక్తి పేరుతో ఓట్లు అడగబోదని పేర్కొన్నారు. “మేము కూడా మీకన్నా ఎక్కువగా శ్రీరాముడిని పూజిస్తాం” అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని విమర్శించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను మంత్రి గుర్తు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారని చెప్పారు. అలాంటి గాంధీ కుటుంబ సభ్యులను మావోయిస్టులు, ముస్లిం లీగ్ అంటూ విమర్శించడం సరైంది కాదన్నారు.

మహిళల భద్రత అంశంపైనా మంత్రి స్పందించారు. మహిళలపై ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ న్యాయబద్ధంగా వ్యవహరించాలని, బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో భద్రాచలం, వేములవాడ, కొండగట్టు, బాసర వంటి దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద రాష్ట్ర దేవాలయాలకు ఎంత నిధులు ఇచ్చిందో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలకు ప్రత్యేకంగా రెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు అడగలేదని కూడా విమర్శించారు.

చివరగా, తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి పర్యటన ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించారని, కానీ ఆశించిన ఫలితం రాలేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంశాల కంటే రాజకీయ ప్రసంగాలకే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. తెలంగాణ హక్కులు, అభివృద్ధి, నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE