e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుతోంది: సీఎం

మన భారత్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అయినప్పటికీ, రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, ఎస్ఐఆర్‌, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, బండి భగీరథ్ కేసు వంటి అనేక అంశాలపై విస్తృతంగా స్పందించారు.

ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో పూర్తిగా అభివృద్ధి అంశాలపైనే చర్చించినట్లు సీఎం తెలిపారు. హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించానని, వాటిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. “నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయాల్సిందే” అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడగలేదని, తమ ప్రభుత్వం మాత్రం తెలంగాణ హక్కుల కోసం నేరుగా పోరాడుతోందని తెలిపారు.

రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్‌లు, డిఫెన్స్ భూములు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు ఏడీబీ నిధులు, జాతీయ రహదారుల అనుమతుల విషయంలో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు.

2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ లక్ష్య సాధనకు కేంద్ర సహకారం అవసరమని ప్రధానికి వివరించగా, ఆయన అంగీకరించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ప్రధాని సూచించారని తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని “బ్రిటిష్ జనతా పార్టీ”గా అభివర్ణించిన ఆయన, విభజించి పాలించడం ఆ పార్టీ సిద్ధాంతమని ఆరోపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలేనని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని నిర్మూలించడం బీజేపీ విధానమైతే, వారిని ఒప్పించి జనజీవనంలో కలపడం కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు.

ఎస్ఐఆర్‌ను బీజేపీ రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని సీఎం మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేరళలో మూడు సీట్లు, తమిళనాడులో రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ, గెలవలేని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రయోగిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని, మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు.

మావోయిస్టుల సరెండర్లపై స్పందిస్తూ తెలంగాణలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. “బుల్లెట్ కాదు బ్యాలెట్” అనే కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మావోయిస్టులు కూడా అంగీకరించారని వ్యాఖ్యానించారు. గణపతి వంటి నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే వైద్య సహాయం, ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. “బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణం చేయొద్దు” వంటి వ్యాఖ్యలు దేశ ప్రజల్లో ఆందోళన కలిగించాయని అన్నారు. దేశాన్ని ఏకం చేసేలా మాట్లాడాల్సిన ప్రధానమంత్రి, విభజనకు దారితీసే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. విదేశాంగ విధానంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలని సూచించారు.

మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సరైన ఫార్ములా అవసరమని పేర్కొన్నారు. 2029లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు అంశంపై కూడా సీఎం స్పందించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్ల కారణంగా విచారణ కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు. సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు వెల్లడించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలపై మాట్లాడుతూ, అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహించాలని అభిప్రాయపడ్డారు.

మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్రంతో సంబంధాలు, బీజేపీ విధానాలు, ప్రజాస్వామ్యం, మైనార్టీల హక్కులు, మహిళా భద్రత వంటి అనేక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE