e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

పీఎం రహత్ పథకంతో బాధితులకు నగదు రహిత చికిత్స.. జిల్లాలో 7 ఆసుపత్రుల్లో సేవలు

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం

పీఎం రహత్ పథకంతో బాధితులకు నగదు రహిత చికిత్స.. జిల్లాలో 7 ఆసుపత్రుల్లో సేవలు

గోల్డెన్ అవర్‌లో వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు: ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, నవంబర్ 29, మన భారత్:

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించి విలువైన ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ (PM RAHAT) పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించడం ఎంతో కీలకమని, ముఖ్యంగా ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారని తెలిపారు. ఈ సమయంలో తగిన వైద్యం అందితే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పీఎం రహత్ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందే అవకాశం ఉందని ఎస్పీ వివరించారు. ఒక్కో బాధితుడికి గరిష్ఠంగా ఏడు రోజుల పాటు ఈ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితుల గురించి ఆందోళన చెందకుండా తక్షణ వైద్యం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

జిల్లాలో ఏడు ఆసుపత్రుల్లో సదుపాయం

ఆదిలాబాద్ జిల్లాలో పీఎం రహత్ పథకం కింద eDAR వ్యవస్థలో నమోదైన ఏడు ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. వాటిలో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి, బోథ్ ఏరియా ఆసుపత్రి, ఉట్నూర్ జిల్లా ఆసుపత్రితో పాటు క్రోమ్ ఆసుపత్రి, నక్షత్ర ఆసుపత్రి, దేవిప్రియ ఆసుపత్రి, శ్రీ గజానన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అవసరమైన సందర్భాల్లో ఈ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పథకం సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

112కు సమాచారం ఇవ్వండి

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. ప్రమాద బాధితులకు వైద్య సేవలు అందించడంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, క్షతగాత్రులను నిర్లక్ష్యం చేయకుండా మానవతా దృక్పథంతో స్పందించాలని పిలుపునిచ్చారు.

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట

ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ సంకేతాలు, రహదారి నియమాలను గౌరవించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించడం, అత్యవసర వైద్య సేవలు అందేలా చూడడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. పీఎం రహత్ పథకంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించుకోవాలని కోరారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రమాదాలను నివారించండి.. విలువైన ప్రాణాలను కాపాడండి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE