e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఐటీసీ గ్లోబల్ క్రిప్టో కరెన్సీ పేరుతో మరోసారి మోసం.. నలుగురు నిందితుల అరెస్ట్

ఐటీసీ గ్లోబల్ క్రిప్టో కరెన్సీ పేరుతో మరోసారి మోసం.. నలుగురు నిందితుల అరెస్ట్

పెట్టుబడులపై అధిక లాభాల ఆశ చూపి ఇద్దరి నుంచి రూ.1.45 లక్షలు వసూలు

ఇప్పటికే జైలులో ఉన్న నిందితులను పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీసులు

క్రిప్టో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: టూ టౌన్ సీఐ కె. నాగరాజు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 20: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ఐటీసీ గ్లోబల్ సంస్థకు సంబంధించిన నిందితులపై ఆదిలాబాద్‌లో మరో మోసం కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.1,45,300 వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న నలుగురు నిందితులను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేశారు. ఈ వివరాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు వెల్లడించారు.

పెట్టుబడుల పేరుతో డబ్బుల వసూలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో ఐటీసీ గ్లోబల్ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న గాజుల ప్రమోద్ కుమార్, వేముల సుధీర్ తదితరులు ఫిర్యాదుదారుడు మేకల రాకేష్‌ను సంప్రదించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. వారి మాటలు విశ్వసించిన రాకేష్ రూ.95,300 పెట్టుబడిగా అందజేశారు. అలాగే రాకేష్‌కు పరిచయమున్న దువ్వాక నరసింహులు సైతం రూ.50 వేల నగదును వారికి చెల్లించారు. ఇలా ఇద్దరి నుంచి మొత్తం రూ.1,45,300 వసూలు చేశారు.

డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన

పెట్టుబడిగా ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించాలని బాధితులు పలుమార్లు నిందితులను కోరినప్పటికీ వారు స్పందించలేదు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు బుధవారం ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పీటీ వారెంట్‌పై నలుగురి అరెస్ట్

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు ఇదివరకే మరో కేసులో జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజా కేసు దర్యాప్తులో భాగంగా పీటీ వారెంట్ ద్వారా వారిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు వెల్లడించారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:

పొలమారశెట్టి రత్నరాజు అలియాస్ రత్నం రాజు (47), తండ్రి ప్రకాష్ రావు.

దొండపాటి లక్ష్మణరావు అలియాస్ లాల్‌రాజ్ (46), తండ్రి సోమరాజు.

గాజుల ప్రమోద్ కుమార్ (37), తండ్రి లింగమూర్తి.

వేముల సుధీర్.

క్రిప్టో పెట్టుబడుల పేరుతో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు ప్రజలకు పలు సూచనలు చేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో తక్కువ సమయంలో పెట్టుబడులు రెట్టింపు చేస్తామని, అధిక లాభాలు అందిస్తామని హామీలు ఇచ్చే వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయత, చట్టబద్ధతను పూర్తిగా పరిశీలించాలని కోరారు.

ఇలాంటి ఆర్థిక మోసాలకు గురైనవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్ లేదా సైబర్ ఆర్థిక మోసాలు జరిగినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE