e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కోర్టు కాంప్లెక్స్‌లో ఉద్యోగం పేరుతో రూ.1.20 లక్షల మోసం

కోర్టు కాంప్లెక్స్‌లో ఉద్యోగం పేరుతో రూ.1.20 లక్షల మోసం

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగి కుటుంబానికి టోకరా.. ఇద్దరు అరెస్ట్, మరొకరు పరారీ

R9S సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో నకిలీ నియామక పత్రం జారీ

ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దు: రూరల్ సీఐ రహీం పాషా

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 20: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని కొందరు మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.20 లక్షలు వసూలు చేసిన ముగ్గురిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ వివరాలను ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా వెల్లడించారు.

ఏజెన్సీ పేరుతో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మకం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం శివఘాట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి కోర్టు కాంప్లెక్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ముగ్గురు వ్యక్తులు నమ్మించారు. R9S సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా కోర్టు కాంప్లెక్స్‌లో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని, తమ ద్వారా ఉద్యోగం పొందవచ్చని బాధితుడికి ఆశ చూపారు. ఇందుకోసం రూ.1,20,000 చెల్లించాలని డిమాండ్ చేశారు.

వారి మాటలు నమ్మిన బాధితుడు రూ.లక్ష నగదుగా, మరో రూ.20 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. అనంతరం ఏజెన్సీ పేరుతో నియామక పత్రాన్ని సైతం అందజేశారు. ఉద్యోగంలో ఎప్పుడు చేరాలనే విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేస్తామని చెప్పి పంపించారు.

నియామక పత్రం ఇచ్చి కాలయాపన

డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు ఉద్యోగంలో చేర్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఎంతకాలం వేచి చూసినా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం కలిగింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు నవంబర్ 17, 2026న ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు Cr.No.440/2026, BNS సెక్షన్లు 316(2), 318(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుల వివరాలు

చునార్కర్ అశోక్ (46), తండ్రి రాజారం, సిర్పూర్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.

బొల్లా నాగరాజు – పరారీలో ఉన్నాడు.

నేరువట్ల దేవరాజు అలియాస్ దేవేందర్ (43), తండ్రి ఓదయ్య, మందమర్రి, మంచిర్యాల జిల్లా.

ఈ కేసు దర్యాప్తులో ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా, ఎస్ఐ వి. విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించవద్దు

ఈ సందర్భంగా పోలీసులు నిరుద్యోగులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు, సంబంధిత సంస్థల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE