e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీసీ బిడ్డలకే..

కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యావంతులకు అవకాశం.. సామాజిక న్యాయానికి ఆచరణలో ప్రాధాన్యత ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకూ బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు, ఉద్యమ నేపథ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించిన నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక న్యాయం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గురించి మొదటి నుంచి తన గళాన్ని వినిపిస్తున్న కవిత, ఇప్పుడు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ అదే విధానాన్ని అమలు చేయడం విశేషంగా నిలిచింది.

తెలంగాణ రక్షణ సేన పార్టీ తొలిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రెండు స్థానాలనూ బీసీ అభ్యర్థులకే కేటాయించడం ద్వారా సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన, తెలంగాణ ఉద్యమంతో అనుబంధం కలిగిన విద్యావంతులను అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా యువత, విద్యావంతులు, బీసీ వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే సందేశాన్ని ఇచ్చారని విశ్లేషిస్తున్నారు.

విజయదశమి పర్వదినం సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యమ నేపథ్యం ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ఒక ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా కవిత ప్రకటించారు. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యను పూర్తి చేసి, జాతీయ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రజాపతిని మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతలు, సామాజిక నేపథ్యం, ఉద్యమ అనుబంధం, ప్రజా సమస్యలపై అవగాహనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యావంతులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీసీ వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలనే నినాదం కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ కనిపించాలనే ఉద్దేశంతో రెండు స్థానాలనూ బీసీలకు కేటాయించడం అభినందనీయమని ఆ వర్గాల నాయకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో బీసీల ప్రాతినిధ్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో తెలంగాణ రక్షణ సేన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తమకు ఇంతటి కీలక అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాష్ కొల్లూరి ప్రజాపతి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులు, విద్యావంతుల హక్కులు, బీసీల సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ ఎన్నికలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ఒక అవకాశంగా మారాలని పార్టీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. పార్టీలకు అతీతంగా బీసీ వర్గాలన్నీ ఐక్యంగా నిలిచి విద్యావంతులైన తమ సామాజిక వర్గ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా బీసీల రాజకీయ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతో పాటు సామాజిక న్యాయం సాధనకు బలమైన గొంతుకను చట్టసభల్లో వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

రెండు స్థానాలకూ బీసీ అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా తెలంగాణ రక్షణ సేన రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. అభ్యర్థుల ఎంపికతో ప్రారంభమైన ఈ రాజకీయ ప్రయాణం పట్టభద్రుల మద్దతుతో ఏ స్థాయికి చేరుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE