e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 27, 2026

అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్.. రూ.4.20 లక్షలు కాజేసిన నిందితుడు

అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్.. రూ.4.20 లక్షలు కాజేసిన నిందితుడు

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్: అక్టోబర్ 26: వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు పంపించి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి రూ.4.20 లక్షలకు పైగా నగదును కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని బేల పోలీసులు సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన దినేష్ పటేల్ (23)ను గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

సోమవారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. బేల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంగిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ వెబ్‌సైట్ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను తెరిచిన తర్వాత ఫోన్‌పే ద్వారా రూ.2,200 చెల్లించాలని సూచించడంతో బాధితుడు ఆ మొత్తాన్ని చెల్లించాడు.

అనంతరం బాధితుడి అనుమతి లేకుండానే అతడి క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఖాతాల నుంచి వరుసగా 16 లావాదేవీలు జరిగి మొత్తం రూ.4,20,210 డెబిట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు

సైబర్ మోసం జరిగిన వెంటనే పోలీసులు ఆన్‌లైన్ లావాదేవీలు, మొబైల్ నంబర్లు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. ఈ దర్యాప్తులో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన దినేష్ పటేల్ నిందితుడిగా గుర్తించారు. అనంతరం గుజరాత్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై దేశవ్యాప్తంగా 220 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు, తెలంగాణలో 20 ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా వల

నిందితుడు ఇతరుల గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించి, సోషల్ మీడియా వేదికగా నకిలీ ఎస్కార్ట్, కాల్ గర్ల్ తదితర ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన లింకులను ప్రచారం చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆ లింకుల ద్వారా సంప్రదించిన వారితో టెలిగ్రామ్, వాట్సాప్‌లలో మాట్లాడి వివిధ రకాల సేవలు అందిస్తామని నమ్మించేవాడని వెల్లడించారు.

బాధితుల నుంచి ముందస్తుగా డబ్బులు తీసుకున్న అనంతరం ఎలాంటి సేవలు అందించకుండా మోసం చేసేవాడని పోలీసులు తెలిపారు. బాధితులు పంపిన నగదును మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా ఇతర ఖాతాలకు మళ్లించడంతో పాటు, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిగిన సందర్భాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికల నుంచి గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేసి వాటి ద్వారా వస్తువులు పొందేవాడని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, వనస్థలిపురం, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కొన్ని సైబర్ మోసాలతోనూ నిందితుడికి సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.

రూ.2 లక్షలు బాధితుడికి తిరిగి

బాధితుడి నుంచి మోసపూరితంగా కాజేసిన మొత్తంలో రూ.2 లక్షలను పోలీసులు సకాలంలో ఖాతాల్లో నిలిపివేసి, కోర్టు ప్రక్రియ ద్వారా బాధితుడికి తిరిగి అందజేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సైబర్ ఆర్థిక మోసాల్లో ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని సూచించారు.

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం

నిందితుడి వద్ద నుంచి సైబర్ నేరాలకు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక మినీ ఐప్యాడ్, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మోసాల ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తూ మరిన్ని సైబర్ నేరాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను తెరవవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆన్‌లైన్ సేవలు, ఎస్కార్ట్ సర్వీసులు లేదా ఇతర ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో ముందస్తుగా డబ్బులు చెల్లించాలని కోరే వ్యక్తులను నమ్మవద్దన్నారు.

బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సమాచారం, ఓటీపీ వంటి కీలక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించడంతో పాటు సైబర్ ఆర్థిక మోసాల హెల్ప్‌లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అత్యాశకు లోనుకాకుండా, అనుమానాస్పద లింకులు మరియు సందేశాల విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.

ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్ కుమార్, బేల ఎస్ఐ మధుకృష్ణ, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ గోపికృష్ణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నిందితుడి వివరాలు: దినేష్ పటేల్ (23), తండ్రి గంగారం పటేల్, పటేల్ మొహల్లా, దగర్ గ్రామం, ఉదయ్‌పూర్ జిల్లా, రాజస్థాన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE