గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం
యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి త్వరలో ఆర్వో వాటర్ ప్లాంట్: ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, నార్నూర్: సెప్టెంబర్ 19, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం శనివారం నార్నూర్ మండలం గుండాల గోండు గూడ గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రామ ప్రజలు, యువతతో మాట్లాడి పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. “గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పు ద్వారానే గంజాయిని సమాజం నుంచి దూరం చేయవచ్చు” అని పేర్కొన్నారు.
గంజాయి సాగుపై సమాచారం ఇవ్వాలి
గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా, మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడమే జిల్లా పోలీసుల లక్ష్యమని స్పష్టం చేశారు.
గంజాయి సాగుకు పాల్పడుతున్న వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసేలా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
విద్యతోనే భవిష్యత్తుకు మార్గం
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులో ప్రోత్సహించాలని అన్నారు. విద్య వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ, సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు 50 పుస్తకాలు, పెన్నులు అందజేశారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి
ప్రజలు నకిలీ బాబాలను నమ్మకుండా, అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. మంత్రాలు, తంత్రాలు, మూఢనమ్మకాల పేరుతో మోసపోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
ప్రజలు మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఎస్పీ సూచించారు. మన పూర్వీకులు తీసుకున్న జొన్న వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచన మేరకు సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు.
ఫ్లోరైడ్ సమస్యకు ఆర్వో వాటర్ ప్లాంట్
గుండాల గోండు గూడ గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్న నేపథ్యంలో త్వరలోనే గ్రామానికి ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటైన అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని తెలిపారు.
ఆరు విభాగాల్లో ఉచిత వైద్య పరీక్షలు
‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రైవేటు వైద్యుల బృందం ఆధ్వర్యంలో సుమారు 200 మంది గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఆప్తమాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సహా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
యువతకు క్రీడా సామగ్రి పంపిణీ
గ్రామ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు వాలీబాల్ కిట్లు, క్రికెట్ కిట్ అందజేశారు. యువత క్రీడలపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై శ్రీ సాయి, గాదిగూడ ఎస్సై రమ్య, వైద్యులు అశోక్, రమా అశోక్, గోపాల్, తౌఫిక్, వంశీ, చంద్రకాంత్, గ్రామ సర్పంచ్ రాథోడ్ సురేష్, పటేల్ కుమ్రా మాల్కో, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, యువతతో పాటు సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
