మన భారత్ | ఆదిలాబాద్
చోరీ రాగి తీగల అక్రమ రవాణా భగ్నం..
– రూ.3.55 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
ఆదిలాబాద్, జూలై 5 (మన భారత్): చోరీకి గురైన రాగి తీగలను కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రూ.3.55 లక్షల విలువైన 296 కిలోల రాగి తీగలు, ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మావల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ బి.డి. ప్రేమ్ కుమార్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని దాస్నాపూర్ గ్రామంలోని పిట్టలవాడ ప్రాంతంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని తనిఖీ చేయగా ఇనుప స్క్రాప్‌తో పాటు 17 సంచుల్లో 296 కిలోల రాగి తీగలు లభ్యమయ్యాయి. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.3.55 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.
విచారణలో ప్రధాన నిందితుడు షేక్ అయ్యూబ్ చోరీకి గురైన రాగి తీగలను తెలిసి కూడా కొనుగోలు చేసి వాటిని నిజామాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ వ్యవహారంలో షేక్ అమర్ సహకరిస్తున్నట్లు వెల్లడైంది.
అలాగే దాస్నాపూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారులు మొహమ్మద్ అబ్దుల్ మతీన్ అలియాస్ సౌఫిక్, మొహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్, పంజేషా మహల్లాకు చెందిన మొహమ్మద్ జావేద్, మొహమ్మద్ ఫైజ్ ఉద్దీన్ చోరీ సొత్తుగా అనుమానిస్తున్న రాగి తీగలను విక్రయించినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అరెస్టు చేసిన నిందితులు
* షేక్ అయ్యూబ్ – నిజామాబాద్
* షేక్ అమర్
* మొహమ్మద్ అబ్దుల్ మతీన్ అలియాస్ సౌఫిక్ – దాస్నాపూర్
* మొహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్ – పిట్టలవాడ రోడ్, దాస్నాపూర్
* మొహమ్మద్ జావేద్ – పంజేషా మహల్లా
* మొహమ్మద్ ఫైజ్ ఉద్దీన్ – పంజేషా మహల్లా
నిందితుల వద్ద నుంచి ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం, 17 సంచుల్లో ఉన్న 296 కిలోల రాగి తీగలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
చోరీ సొత్తు కొనుగోలు, నిల్వ, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై మావల పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
